Sunday, November 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేపటి నుంచి ప్రయివేటు కాలేజీల నిరవధిక బంద్‌

రేపటి నుంచి ప్రయివేటు కాలేజీల నిరవధిక బంద్‌

- Advertisement -

6న హైదరాబాద్‌లో లక్ష మంది సిబ్బందితో సమావేశం
10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో సభ
ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్‌ తనిఖీలు సరికాదు
ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.900 కోట్లు విడుదల చేయాలి
ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మెన్‌ రమేష్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక బంద్‌ చేపట్టాలని నిర్ణయించాయి. ఈనెల ఆరో తేదీన హైదరాబాద్‌లో లక్ష నుంచి లక్షన్నర మంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించాయి. ఈనెల 10 లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో సభను నిర్వహిస్తామని తెలిపాయి. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) చైర్మెన్‌ నిమ్మటూరి రమేష్‌బాబు మాట్లాడుతూ ఫీజు బకాయిల్లో టోకెన్లు ఇచ్చిన నిధులు రూ.1,200 కోట్ల వరకు ఉన్నాయని వివరించారు. దసరా నాటికి రూ.600 కోట్లు, మిగిలిన రూ.600 కోట్లు దీపావళి నాటికి ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పటి వరకు 300 కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. మిగిలిన రూ.900 కోట్లు ఆదివారం నాటికి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అడిగితే విజిలెన్స్‌ తనిఖీలు చేపడతామంటూ బెదిరింపు ధోరణులకు దిగడం సరైంది కాదన్నారు. కాలేజీ యాజమాన్యాలను భయభ్రాంతులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం తరహాలోనే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని అన్నారు. కేసీఆర్‌ సలహాలు పాటిస్తున్నారా?అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. భయభ్రాంతులకు గురిచేసినా తాము బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఫీజు బకాయిలను విడుదల చేయాలంటూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ, లా, ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, డిగ్రీ, పీజీ, నర్సింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఏ, బీఈడీ, ఎంఈడీ ప్రయివేటు కాలేజీలు సోమవారం నుంచి నిరవధిక బంద్‌ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆదివారం వరకు కాలేజీలను ప్రభుత్వం ఆదుకోవాలనీ, ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బంద్‌తోపాటు అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. అన్ని కాలేజీలూ ఫీజుల కోసం ఎదురుచూస్తుంటే కొన్ని కాలేజీలకు ప్రభుత్వం ఫీజులను మంజూరు చేసిందన్నారు. పది శాతం లంచం తీసుకుని ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయనీ, విజిలెన్స్‌ విచారణలో దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా సీఎస్‌ ఉన్నపుడు నాలుగు కాలేజీలకే నిధులను విడుదల చేశారనీ, దానిపైనా విచారణ జరగాలని కోరారు. నిధుల దుర్వినియోగం ఎక్కడ జరుగుతుందో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. బంద్‌తోపాటు ఎమ్మెల్యేల ఇండ్లు, అధికారుల ఇండ్లతోపాటు కలెక్టరేట్లను ముట్టడిస్తామని చెప్పారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అసౌకర్యం కలుగుతున్నందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు తమ బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫతి వైస్‌ చైర్మెన్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఫీజులివ్వాలంటూ ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయాల్సి వస్తుందని ఆనుకోలేదన్నారు. సకాలంలో ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల విద్యా ప్రమానాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పది వేల కోట్ల వరకు ఫీజు బకాయిలున్నాయని వివరించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల డ్రాపౌట్లు పెరుగుతున్నారని అన్నారు. బ్లాక్‌మెయిల్‌ కోసమే విజిలెన్స్‌ తనిఖీలు చేపడుతున్నారని ఆరోపించారు. ఫీజులివ్వకుంటే భవిష్యత్తులో సామాజిక సమస్యగా మారుతుందన్నారు. టీపీడీఎంఏ అధ్యక్షులు బి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఫీజులిస్తామని హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని చెప్పారు. ఇప్పుడు విజిలెన్స్‌ తనిఖీలు చేపడతామంటూ బెదరించడం సమంజసం కాదన్నారు. కాలేజీల్లోని సిబ్బందికి జీతాలిచ్చే పరిస్థితి లేదనీ, యాజమాన్యాలకు అప్పు దొరకడం లేదని అన్నారు. ఫీజు బకాయిల్లో 50 శాతం ఇప్పుడు విడుదల చేయాలనీ, మిగిలిన వాటిని మార్చి నాటికి చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫతి కోశాధికారి కొడాలి కృష్ణారావు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కె సునీల్‌కుమార్‌, ప్రతినిధులు రేపాక ప్రదీప్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -