ప్రారంభించిన ప్రధాని మోడీ
పలు స్టార్టప్‌ల స్టాల్స్ సందర్శన
సదస్సుకు 20 దేశాల అధినేతలు హాజరు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సదస్సు ఢిల్లీలో మొదలైంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోను సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. పలు స్టార్టప్‌ల స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా భారత యువత ప్రతిభ, సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుస్తాయనీ, ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు పడుతుందని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా వృద్ధి చెందుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనమని తెలిపారు. ‘గ్లోబల్ సౌత్’లో నిర్వహిస్తున్న ఈ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ భారత్‌లో జరుగుతుండడం గర్వకారణమని ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
ఈ ఎక్స్‌పోలో 600కుపైగా హైపొటెన్షియల్ స్టార్టప్‌లు కొలువుదీరాయి. 13దేశాల పెవిలియన్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ప్రధాని మోడీతోపాటు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో ఈ సదస్సులో పాల్గొంటారు. వీరితో పాటు సుమారు 20 దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. కాగా ఈనెల 20 వరకూ జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో డెలిగేట్స్ తరలివచ్చారు. ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలవాల్సిన గూగుల్ సీఈఓ సుందర్ పిచారు, ఓపెన్ ఏఐ బాస్ సామ్ ఆల్ట్‌మన్ వంటి వారు ఇంకా భారత్ రాలేదు. వారి సెషన్లు బుధవారం నుంచి మొదలవుతాయి. సదస్సులో భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశానిర్దేశం ఎలా ఉండాలి, ప్రభుత్వాలు దీనిని ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై వీరు చర్చించనున్నారు.



