నవతెలంగాణ – పాట్నా : బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో బీహార్‌లో ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీ అయిన జెడియు విధానాలను ప్రజలకు వివరించడానికి ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు మంచి అవకాశంగా మారింది. నేడు జరుగుతున్న భారత్ బంద్‌లో ఇండియా బ్లాక్ నేతలు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా యొక్క ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్‌ఐఆర్)ను వ్యతిరేకిస్తూ ఇండియా బ్లాక్ నేతలు నినాదాలు చేశారు. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ బీహార్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు సచివాలరు హాల్ట్ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌పై నిల్చొని నిరసన చేశారు. ఈ బంద్‌లో పూర్ణియాకు చెందిన ఇండిపెండెంట్ ఎంపి పప్పు యాదవ్ కూడా పాల్గొన్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) విద్యార్థి విభాగం స్టూడెంట్స్ జెహానాబాద్ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. టైర్లకు నిప్పంటించారు. భారత్ బంద్‌లో పాల్గొన్న ఆర్‌జెడి నేత తేజస్వి ఎస్‌ఐఆర్‌పై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ఓటర్ల ధృవీకరణ కోసం ఇసి 11 పత్రాలను ప్రతిపాదించడం.. ఆ పత్రాలు లేకపోతే.. ఓటర్ల జాబితా నుంచి వారి తొలగించే ప్రయత్నాల్లో భాగంగానే ఎస్‌ఐఆర్ సవరణను ముందుకు తెచ్చారని ఆయన విమర్శించారు. దీనిపై ఎన్నికల సంఘానికే స్పష్టత లేదు. ఎస్‌ఐఆర్‌పై బీహార్ ఎన్నికల సంఘం వివరణ కూడా అడగడం లేదు. బీహార్ ఎన్నికల సంఘం కేవలం పోస్టాఫీసుగా మాత్రమే పనిచేస్తుందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.