ఏఐ అభివృద్ధికి చేజారిన అవకాశం
మోడీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు
న్యూఢిల్లీ : కృత్రిమ మేథ(ఏఐ) అభివృద్ధికి అవసరమైన సిలికాన్ సప్లరు ఛైన్ కోసం అమెరికా విదేశాంగశాఖ ‘ప్యాక్స్ సిలికా’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీనిలో జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయిల్, యూఏఈ, ఆస్ట్రేలియా దేశాలు భాగంగా ఉన్నాయి. అయితే, ఇందులో భారత్‌కు మాత్రం చోటు దక్కలేదు. తాజా పరిణామం భారత్‌లో రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఈ విషయంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీపై విమర్శలు చేసింది. హైటెక్ సరఫరా గొలుసులపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా దీన్ని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ అన్నారు. ఇటీవల మోడీ-ట్రంప్ సంబంధాల్లో వచ్చిన అపార్థాల నేపథ్యంలో భారత్‌కు ఇందులో చోటు దక్కదని తాము ముందే భావించామన్నారు. ఈ విషయం తమను ఆశ్చర్యపరచలేదని చెప్పారు. ఇందులో మనమూ భాగమై ఉంటే అది మనకు ఎంతో ప్రయోజనం కలిగేదని అభిప్రాయపడ్డారు. గొప్ప స్నేహితుడైన ట్రంప్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడినట్టు మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
అభివృద్ధిలో భాగంగా ఏర్పాట్లు
యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం సిలికాన్ సరఫరా కోసం బలవంతంగా ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ ‘ప్యాక్స్ సిలికా’ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఏఐకి సంబంధించిన టూల్స్, సామర్థ్యాలను రక్షించడంతో పాటు, సాంకేతికతల అభివృద్ధిలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది భారత్‌లో ఇండాయా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగన్నున సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ఏఐ- యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ దీన్ని ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిర్వహిస్తున్న తొలి ఏఐ సదస్సు ఇదే.



