పెరగనున్న ధరలు, తగ్గనున్న జీడీపీ : మాజీ సీఈఏ అరవింద్ సుబ్రహ్మణ్యం హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతోందని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. యుద్ధం వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా నిలిచిపోవడం వల్ల దేశ జీడీపీ 1 శాతం పైగా పడిపోయి, ద్రవ్యోల్బణం 1.5 శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఎంతో కాలం కొనసాగవని, చివరికి సామాన్యుడిపై ధరల భారం పడక తప్పదని విశ్లేషించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన స్తబ్దత ముప్పులో ఉందన్నారు. అంతర్జాతీయంగా చమురు, సహజ వాయువు, ఎరువుల సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడిన భారత్ రెండంచుల నష్టాన్ని చవి చూడబోతోందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్లు మూతపడటం వంటి ఆర్థిక మందగమన సంకేతాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ నుంచి తక్కువ ధరకే ఇంధన, ఎరువుల నిల్వలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని సుబ్రమణ్యం సూచిం చారు. దేశీయంగా ఎక్సైజ్ సుంకాల కోత, సబ్సిడీల వంటి చర్యలు స్వల్పకాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ సుదీర్ఘ కాలం పాటు పెరిగిన భారాలను ప్రభుత్వం మోయలేదన్నారు. చివరికి ఆ భారం సామాన్య వినియోగదారుడిపైనే వేయనుందన్నారు. భారీ అప్పుల కారణంగా ప్రభుత్వాలకు ఆర్థికంగా నిలదొక్కుకునే శక్తి తగ్గిపోవడం ఈ సంక్షోభంలో మరో ప్రధాన ప్రతికూలాంశమన్నారు. రూపాయి విలువ పతనం కావడం కూడా విధానకర్తలకు ఒక గట్టి సవాలేనని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఒక గుణపాఠంగా భావించి, భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్నారు.. దీర్ఘకాలిక వ్యూహంతో పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవడం, కీలక వస్తువుల వ్యూహాత్మక నిల్వలను నిర్మించుకోవడం ద్వారానే ఇలాంటి ప్రపంచ స్థాయి దిగ్బంధనాలను ఎదుర్కోగలమన్నారు.



