Saturday, February 21, 2026
E-PAPER
Homeజాతీయంఅమెరికా ధృతరాష్ట్ర కౌగిలిలో భారత్‌

అమెరికా ధృతరాష్ట్ర కౌగిలిలో భారత్‌

- Advertisement -

‘పాక్స్‌ సిలికా’లో చేరిక..చైనా రేర్‌ ఖనిజాల డిమాండ్‌ను తగ్గించేందుకే ట్రంప్‌ కుట్ర

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నారు. అటు టారిఫ్‌, ఇటు బెదిరింపులే కాక దేశాలను తమవైపు తిప్పుకునేలా ఎత్తుగడలేస్తున్నారు. ముఖ్యంగా చైనాను నిలువరించటంపైనే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. చైనాలోని అరుదైన రేర్‌ ఖనిజాల దిగుమతిపై ఆధారపడటం కన్నా..భారత్‌ను మచ్చిక చేసుకోవటానికి సుంకాల తగ్గింపే.. కాకుండా ఇక్కడి ఖనిజ సంపదపై కూడా ఆయన కన్నుపడింది. అందులో భాగంగానే అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన అంతర్జాతీయ వ్యూహాత్మక కూటమి ‘పాక్స్‌ సిలికా’లో భారత్‌ చేరింది. ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ వేదికగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ కూటమిలో చేరుతూ భారత్‌ సంతకం చేసింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సంతకంతో కీలక ఖనిజాల ఉత్పత్తి, కృత్రిమ మేధ వంటి రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.

దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. ”ప్రపంచం భారత్‌ను విశ్వసిస్తోంది. మన దగ్గర నిపుణుల కొరత లేదు. ఇప్పుడు పాక్స్‌ సిలికాలో చేరడం వ్యూహాత్మక ముందడుగు. సెమీకండక్టర్ల సరఫరా గొలుసు, చిప్‌ తయారీ వంటి రంగాలకు ఇది చాలా కీలకం. ఈ కూటమిలో చేరడంతో భారత ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్‌ పరిశ్రమకు లబ్ది చేకూరనుంది” అని వెల్లడించారు. అనంతరం సెర్గియో గోర్‌ మాట్లాడుతూ.. ”రెండు దేశాల మధ్య విస్తృత అవకాశాలకు కొదవలేదు. ప్యాక్స్‌సిలికాలో భారత్‌ చేరడం కీలక పరిణామం” అని అన్నారు. అంతేగాక, త్వరలోనే భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముఖాముఖి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.

ఏంటీ పాక్స్‌సిలికా..
కృత్రిమమేధ పురోగతికి అవసరమైన సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు భద్రత కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు అమెరికా గతేడాది ఈ ‘పాక్స్‌ సిలికా’ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆస్ట్రేలియా, గ్రీస్‌, ఇజ్రాయిల్‌, జపాన్‌, ఖతర్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యూకే సభ్యదేశాలుగా ఉన్నాయి. భవిష్యత్తులో ఏఐ, సాంకేతిక వ్యవస్థల అభివృద్ధి కోసం విశ్వసనీయ దేశాలన్నీ కలిసి ఓ భాగస్వామ్య ప్రణాళికను రూపొందించడమే ఈ కూటమి లక్ష్యం. అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రధమ ప్రాధాన్యంగా ఈ కూటమి ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -