రిపబ్లిక్ డే ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఘర్షణలు నిండిన ప్రపంచంలో భారతదేశం ఒక శాంతి దూతగా వ్యవహరిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. శాంతి సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని, ఇది మానవాళి భవిష్యత్‌ను సురక్షితంగా ఉంచడానికి ఎంతో కీలకమని అన్నారు. ప్రపంచంలో శాంతి ఉంటేనే మానవాళి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని చెప్పారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్, మహిళా సాధికారత, వందేమాతరం, జీఎస్టీ , దేశ ఆర్థిక వ్యవస్థ.. వంటి అంశాలను ప్రస్తావించారు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించామని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన దాడులతో ఉగ్రవాద కేంద్రాలు ధ్వంసం చేసామన్నారు. సియాచిన్ బేస్ క్యాంప్‌ను వ్యక్తిగతంగా సందర్శించిన విషయాన్ని, సుఖోయ్, రాఫెల్, జలాంతర్గామిల్లో ప్రయాణించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగే ప్రయాణానికి ”నారీశక్తి” కీలకమన్నారు. గ్రామీణ స్వయం సహాయక బృందాల నుంచి అంతరిక్షం వరకు ఆధునిక భారతదేశం యొక్క కథను దాని కుమార్తెలు రాస్తున్నారని ప్రశంసించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో దాదాపు 46 శాతం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారని అన్నారు. గతేడాది క్రీడారంగంలో మన అమ్మాయిలు చారిత్రాత్మక విజయాలు సాధించారని తెలిపారు. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్, అంధుల మహిళల 20 ప్రపంచ కప్‌ల విజయాలను ఆమె ఉదహరించారు. అలాగే, పేదరిక నిర్మూలనలో భారతదేశం వేగంగా పురోగతి సాధిస్తుందని తెలిపారు. దశాబ్దాలుగా పేదరికంతో పోరాడుతున్న లక్షలాది మంది పౌరులను దారిద్య్రరేఖకు పైకి చేర్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు దాదాపు 81 కోట్ల మంది లబ్దిదారులకు కీలకమైన సహాయాన్ని అందిస్తున్నాయన్నారు.
భారత రాజ్యాంగం ఇప్పుడు 22 భాషలలో అందుబాటులో ఉందని అధ్యక్షుడు ముర్ము ప్రకటించారు. ఈ మైలురాయి ”రాజ్యాంగ జాతీయతను” పెంపొందించడం, పౌరులు తమ మాతృభాషలో దేశపు ప్రాథమిక పత్రంతో నిమగమవ్వడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రపంచ నాయకుడిగా ఎందిగిందని చెప్పారు. ప్రపంచంలో జరుగుతున్న డిజిటల్ లావాదేవీలలో సగానికి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయని ఆమె అన్నారు. అలాగే, భారతదేశం సమీప భవిష్యత్తులోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా పయనిస్తోందని ఆమె అన్నారు. జిఎస్‌టిని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆర్థిక సమైక్యతకు అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా రాష్ట్రపతి అభివర్ణించారు. ‘వందేమాతరం’ గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకలను కూడా రాష్ట్రపతి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో ‘వందేమాతరం’ భాషాపరమైన అడ్డంకులను అధిగమించి ప్రజలను ఏకం చేసిందని వ్యాఖ్యానించారు.
శాంతికాముక దేశం ఇండియా
- Advertisement -
- Advertisement -



