17 పరుగులతో నెదర్లాండ్స్‌పై గెలుపు
అర్థ సెంచరీతో మెరిసిన శివం దూబె
వరుణ్ చక్రవర్తి మూడు వికెట్ల మాయ
భారత్ 193/6 నెదర్లాండ్స్ 176/7
డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. వరుసగా యుఎస్‌ఏ, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్‌పై గెలుపొందిన టీమ్ ఇండియా అజేయంగా సూపర్8కు చేరుకుంది. శివం దూబె (66) అర్థ సెంచరీతో చెలరేగటంతో భారత్ తొలుత 193/6 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి (3/14) మాయాజాలంతో నెదర్లాండ్స్ ఛేదనలో 176 పరుగులకే పరిమితమైంది. 17 పరుగులతో భారత్ సాధికారిక విజయం సాధించింది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
భారత్‌కు ఎదురులేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశను ఆతిథ్య భారత్ అజేయంగా ముగించింది. బుధవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ 17 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది. 194 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్ 176/7 పరుగులకే పరిమితమైంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/14) మాయాజాలం చేయగా, ఆల్‌రౌండర్ శివం దూబె (2/35) రాణించాడు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ శివం దూబె (66, 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. హార్దిక్ పాండ్య (30, 21 బంతుల్లో 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (21, 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన శివం దూబె ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో గ్రూప్ దశలో భారత్ వేట ముగిసింది. ఆదివారం అహ్మదాబాద్‌లోనే దక్షిణాఫ్రికాతో సూపర్8 సమరాన్ని షురూ చేయనుంది.
పోరాడిన నెదర్లాండ్స్!
నెదర్లాండ్స్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యం. జశ్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి త్రయాన్ని ఎదుర్కొని నెదర్లాండ్స్ నిలువటం కష్టమే అనుకున్నారు. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ నెదర్లాండ్స్ పోరాట పటిమ చూపించింది. పవర్‌ప్లేలో ఒక్క వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్.. పది ఓవర్లలో రెండు వికెట్లే చేజార్చుకుంది. సాధించాల్సిన రన్‌రేట్ భారీగా ఉండటంతో భారత్ దీమాగా కనిపించినా.. వికెట్లు చేతిలో నిలుపుకుని నెదర్లాండ్స్ రేసులో నిలిచింది. మైకల్ (24), మాక్స్ (20)లు తొలి వికెట్‌కు 35 పరుగులతో శుభారంభం అందించారు. లీడె (33), కొలిన్ (23) మెరవటంతో నెదర్లాండ్స్ 93/3తో మెరుగ్గా కనిపించింది. మిడిల్ ఓవర్లలో బంతి అందుకున్న వరుణ్ చక్రవర్తి డచ్ బ్యాటింగ్ లైనప్‌ను తిప్పేశాడు. మూడు వికెట్లు పడగొట్టిన వరుణ్ మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. ఆర్యన్ దత్ (0) డకౌట్‌గా నిష్క్రమించగా.. స్కాట్ ఎడ్వర్డ్స్ (15), జాచ్ (26), నోవా (25 నాటౌట్) ఆఖరు వరకు క్రీజులో నిలిచారు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసిన నెదర్లాండ్స్.. 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
దూబె ధనాధన్
టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పరుగుల పిచ్ అహ్మదాబాద్‌లో టీమ్ ఇండియా భారీ స్కోరు సాధిస్తుందనే అంచనాలు. కానీ విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ (0) మరోసారి డకౌట్‌గా నిష్క్రమించాడు. ప్రపంచకప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ (17) రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో జోరందుకున్నా.. పవర్‌ప్లేలోనే వికెట్ కోల్పోయాడు. 6 ఓవర్లలో 51/2తో నిలిచిన భారత్ కాస్త ఒత్తిడిలో పడింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (34, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (31, 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. క్రీజులో నిలిచినా.. దూకుడుగా ఆడలేదు. దీంతో రన్‌రేట్ బాగా నెమ్మదించింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ శివం దూబె (66) ధనాధన్ మోత మోగించాడు. హార్దిక్ పాండ్య (30) తోడుగా ఐదో వికెట్‌కు 35 బంతుల్లో 76 పరుగులు జోడించాడు. రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 25 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన దూబె.. డెత్ ఓవర్లలో దంచికొట్టాడు. హార్దిక్, దూబె, రింకు మెరుపులతో ఆఖరు రెండు ఓవర్లలో భారత్ 34 పరుగులు పిండుకుంది. హార్దిక్ పాండ్య సైతం క్రీజులో నిలిచినా.. ఎదురుదాడి చేయలేకపోయాడు. శివం దూబె మెరుపులతో భారత్ 193 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లొగాన్ (3/56), అర్యన్ దత్ (2/19) వికెట్లు పడగొట్టారు.



