Saturday, April 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅంతరాల భారతం

అంతరాల భారతం

- Advertisement -

కుబేరుల సంపద 400 శాతం పెరుగుదల
ఆరేండ్లలో ఆకాశమే హద్దుగా వృద్ధి
ఒక్క శాతం మంది వద్ద 40 శాతం ప్రజల సంపద
1,688 మంది వద్ద జీడీపీలో సగం సొమ్ము
రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం..వెల్త్‌ ట్రాకర్‌ ఇండియా రిపోర్ట్‌

నవతెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌
దేశంలో ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు సతమతమవుతూ తమ సంపాదనను పూట గడవడానికే ఖర్చు చేయాల్సి వస్తున్న తరుణంలో.. మరోవైపు కుబేరుల సంపద మాత్రం రాకెట్‌ వేగంతో దూసుకుపోతోంది. ప్రజల ఆదాయా లు ధరల పెరుగుదలతో హరించుకుపోతుంటే దిగ్గజ కుబేరులు మాత్రం గత ఆరేండ్లలో తమ ఆస్తులను ఏకంగా 400 శాతం పెంచుకున్నారని ‘వెల్త్‌ ట్రాకర్‌ ఇండియా 2026’ కీలక నివేదికలో వెల్లడయ్యింది. ఈ గణాంకాలు దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక అసమానతలకు అద్దం పడుతున్నాయి.

కొద్దిమంది సంపద లక్షల కోట్లలో పెరుగుతుంటే మరోవైపు సామాన్యులు కనీస అవసరాల కోసం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఈ రిపోర్ట్‌ వెల్లడించింది. ఈ ఆర్థిక అసమానతలు రాజ్యాంగ స్ఫూర్తికి ముప్పుగా పరిణమిస్తాయని హెచ్చరించింది. ప్రముఖ లాభాపేక్షలేని స్వచ్చంద సంస్థ (ఎన్‌జీఓ) సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ అకౌంటబిలిటీ అండ్‌ టాక్స్‌ రూపొందించిన ‘వెల్త్‌ ట్రాకర్‌ ఇండియా 2026’ నివేదిక ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య కాలంలో కేవలం ఐదు సంపన్న కుటుంబాల సంపదలో ఏకంగా 400 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.

బ్రిటిష్‌ కాలం నాటి దోపిడీ..
ప్రస్తుతం దేశంలోని కేవలం ఒక శాతం మంది ధనికుల చేతుల్లోనే 40 శాతం దేశ సంపద కేంద్రీకృతమై ఉంది. మరోవైపు దిగువన ఉన్న 50 శాతం జనాభా సంపద వాటా కేవలం 6.4 శాతానికే పరిమితమైంది. దేశంలోని 1,688 మంది అత్యంత సంపన్నుల మొత్తం ఆస్తి రూ.166 లక్షల కోట్లు దాటింది. ఇది భారతదేశ మొత్తం జీడీపీలో దాదాపు సగ భాగమని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిస్థితి బ్రిటిష్‌ కాలం నాటి దోపిడీని తలపిస్తోందని.. సంపద కేంద్రీకృతం కావడం వల్ల అంతరాల భారతంగా మారిందని హెచ్చరించింది. దేశంలో ఆర్థిక అసమానతలు బ్రిటిష్‌ కాలం నాటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయని తెలిపింది.

6 శాతం పన్నుతో రూ.11 లక్షల కోట్ల ఆదాయం..
ఈ తీవ్ర ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించేందుకు ప్రభుత్వం పురోగామి సంపద పన్ను (ఇన్‌హెరిటివ్‌ టాక్స్‌) విధించాలని నివేదిక ప్రతిపాదించింది. రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులున్న ఈ 1,688 మంది కుబేర వ్యక్తులపై 2 నుంచి 6 శాతం వరకు పన్నుతో పాటు వారసత్వ పన్ను విధిస్తే ప్రతీ ఏడాది రూ.10.6 లక్షల కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది. ఈ నిధులతో దేశ ఆరోగ్య, విద్యా రంగాల బడ్జెట్‌ను జీడీపీలో ఒక్క శాతం పెంచడంతో పాటుగా వృద్ధులకు నెలకు రూ.12,000 చొప్పున పెన్షన్‌ అందించవచ్చని పేర్కొంది.

అంబానీపై పన్నుతో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..!
రిలయన్స్‌ ఇండిస్టీస్‌ చైర్మెన్‌ ముకేశ్‌ అంబానీ సంపద 2019 నుంచి 2025 మధ్య కాలంలో 153 శాతం పెరిగిందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ కాలంలో అంబానీ నుంచి కేవలం 2 శాతం సంపద పన్ను వసూలు చేసి ఉంటే దేశంలోని 10వ తరగతి విద్యార్థులందరికీ మూడేండ్ల పాటు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించడానికి అవసరమైన వనరులు సమకూరేవని వివరించింది.

అదానీ సంపద 625 శాతం వృద్ధి
అదానీ గ్రూప్‌ చైర్మెన్‌ గౌతమ్‌ అదానీ సంపద ఆరుళ్లలో 625 శాతం పెరిగింది. అదానీ సంపదపై కేవలం 2 శాతం పన్ను విధిస్తే దేశం మొత్తానికి రెండేళ్ల పాటు ప్రాథమిక ఆరోగ్య సేవలకు నిధులు సమకూర్చవచ్చు. అదే విధంగా కాలుష్యంతో తీవ్రంగా ప్రభావితమైన దాదాపు ఎనిమిది కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఎయిర్‌ ప్యూరిఫైయర్లను కూడా అందించవచ్చని ఈ రిపోర్ట్‌ వెల్లడించింది.

సామాన్యులపైనే అధిక పన్నులు..
”సంక్షేమంపై పెట్టుబడులు పెంచడానికి వనరులు అందుబాటులో లేవని ప్రభుత్వం చేస్తున్న వాదనలను ఈ అధ్యయనం బట్టబయలు చేస్తున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు పన్నులు తగ్గిస్తుంటే.. కష్టపడి పనిచేసే వ్యక్తులు పెద్ద కార్పొరేట్‌ సంస్థల కంటే ఎక్కువ పన్నులు చెల్లిస్తుండటం చాలా ఆందోళనకరం” అని అని సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ అకౌంటబిలిటీ అండ్‌ టాక్స్‌ ప్రచార విభాగం వెల్లడించింది. గత 11 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.19.6 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది.

రెండు భారత్‌లు..
నేడు రెండు భారత్‌లు ఉన్నాయని సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ అకౌంటబిలిటీ క్యాంపెయిన్‌ డైరెక్టర్‌ అనిర్బన్‌ భట్టాచార్య తెలిపారు. తమ సంపదను లక్షల కోట్లలో పెంచుకుంటున్న కొద్దిమంది భారత్‌ ఒక్కటయితే.. మరొకటి అప్పుల్లో కూరుకుపోయి, అనిశ్చిత ఉపాధితో, తమ జీవనోపాధి కోసం పోరాడుతున్న మెజారిటీ అణగారిన వర్గాల భారత్‌” అని భట్టచార్య అన్నారు. ఈ అంతరం ఎంతగా పెరిగితే రాజ్యాంగంలో పొందుపరిచిన భారత దేశ ఆశయం అంతగా దూరమవుతుందని భట్టాచార్య హెచ్చరించారు.

పేదలకు ప్రాథమిక హక్కులను కల్పించొచ్చు..
‘టాక్స్‌ ది టాప్‌’ ప్రచారంలో కీలక భాగస్వామి రాజ్‌ శేఖర్‌ మాట్లాడుతూ.. ఈ అతి సంపన్నులపై సంపద పన్ను విధించడం ద్వారా ప్రజా సేవలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న అసమానతలను పరిష్కరించవచ్చన్నారు. ఇది ప్రస్తుతం అత్యంత అవసరమన్నారు. ”సంపద పన్ను అనేది అన్ని సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం కాకపోయినప్పటికీ పేదలకు ప్రాథమిక హక్కులను కల్పించడంలో ఇది దోహదపడుతుందని వెల్త్‌ ట్రాకర్‌ ఇండియా 2026 నివేదిక పరిశోధకుడు జాకబ్‌ జోషి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -