Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeరాష్ట్రీయంఅందరం కలిస్తేనే భారతదేశం

అందరం కలిస్తేనే భారతదేశం

- Advertisement -

కలిసి ఉండటాన్ని బీజేపీ దెబ్బ తీస్తోంది
దేశ ఐక్యత, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
ట్రంప్‌ పన్నుతో హైదరాబాద్‌ ఫార్మాపై ఎఫెక్ట్‌
జీఎం సీడ్స్‌ అనుమతించాలని అమెరికా ఒత్తిడి
సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
మేడ్చల్‌లో ఏచూరి జయంతి సభ
‘భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై సెమినార్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

అన్ని కులాలు, మతాలు, వర్గాలు, భాషలు.. ఇలా అందరం కలిస్తేనే భారతదేశం అని, ఇలా కలిసి ఉండటాన్ని బీజేపీ దెబ్బ తీస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా బుధవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కమలనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ‘భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై సెమినార్‌ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి పి.సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా ఏచూరి చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్లర్పించారు.
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. దేశవ్యాప్త పోరాటాల్లో ఏచూరి కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. భారత్‌ సమాహారం అని ఏచూరి గతంలోనే చెప్పారని తెలిపారు. మత ప్రాతిపదికన ఉంటే దేశం ఐక్యంగా ఉండదన్నారు. రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్ష తరహా పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ ఆలోచన చేసిందని, ఇందుకు గతంలో ఒక కమిటీ కూడా వేసిందని తెలిపారు. బీజేపీలాంటి మతతత్వ పార్టీలను అధికారంలోకి రానివ్వకుండా దూరంగా ఉంచితేనే రాజ్యాంగాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యమే పోతే హక్కులు ఉండవన్నారు. 4 లేబర్‌ కోడ్‌లను అమలు చేయకపోతే పెట్టుబడులు రావు అని, ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను భయపెడుతోందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో మొదటి దాడి కార్మికవర్గంపైనే జరిగిందని తెలిపారు.
ట్రంప్‌ పన్ను ఎఫెక్ట్‌ హైదరాబాద్‌ ఫార్మా మీదనే ఎక్కువ పడుతుందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ, ఆటో మొబైల్‌, స్టీల్‌ పరిశ్రమలు, అల్యూమినియం పరిశ్రమలు దెబ్బతింటాయని వివరించారు. రైతు ఉద్యమంతోనే బీజేపీకి సీట్లు తగ్గాయన్నారు. జీఎం సీడ్స్‌ భారతదేశంలోనూ అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నదని చెప్పారు. ట్రంప్‌ పన్ను ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు, చేపల చెరువులు దివాళా తీసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నదని, విద్యుత్‌ ప్రయివేటీకరణ కోసమే ఇలా చేస్తోందని అన్నారు.
ప్రతిపక్షాలను ఓడించేందుకు అన్ని హంగులూ కేంద్రం వద్ద ఉన్నాయని చెప్పారు. ధనం, మీడియా బలం బీజేపీ వద్ద ఎక్కువగా ఉన్నాయన్నారు. జాతీయ మీడియా ఎక్కువగా అంబానీ చేతుల్లోనే ఉందన్నారు. డబ్బు, పదవులు చూపి కుల సంఘాల నాయకులను బీజేపీ హక్కున చేర్చుకుంటున్నదన్నారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీలో భాగస్వామ్యమైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వెసులుబాటు కలిపించేలా ఎన్నికల కమిషన్‌ వ్యవహారశైలి ఉందని విమర్శించారు. ఈ సెమినార్‌లో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు డిజి.నర్సింహారావు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్‌, కోమటిరవి, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, వినోద, అశోక్‌, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad