సెమీస్‌లో 1-0తో ఇటలీపై గెలుపు
ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్
ఆతిథ్య జట్టు అదరగొట్టింది. ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో టైటిల్ పోరుకు చేరుకుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచి వరల్డ్‌కప్ బెర్త్ ఖాయం చేసుకున్న టీమ్ ఇండియా.. సెమీఫైనల్లో ఇటలీపై విజయంతో టైటిల్ పోరుకు చేరుకున్నారు. నేడు ఫైనల్లో ఇంగ్లాండ్‌పై గెలుపొంది ప్రపంచకప్ బెర్త్‌తో పాటు క్వాలిఫయర్స్ ట్రోఫీ దక్కించుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది.
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత మహిళల జట్టు జోరు కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 1-0తో ఇటలీపై గెలుపొందిన హాకీ అమ్మాయిలు ఎఫ్‌ఐహెచ్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన ఆతిథ్య భారత్.. సెమీఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. ఇటలీ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. మూడో క్వార్టర్‌లో మనీశ చౌహాన్ (40వ నిమిషంలో) గోల్ కొట్టడంతో భారత్ పైచేయి సాధించింది.
భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్లు లభించగా కేవలం ఒక్క పీసీనే గోల్‌గా మలిచింది. ఆఖరు 15 నిమిషాల ఆటలోనే ఏకంగా ఐదు పెనాల్టీ కార్నర్‌లు దక్కినా.. గోల్స్ కొట్టలేకపోయారు. భారత అమ్మాయిలు డిఫెన్స్‌తో మెప్పించారు. దీంతో ఇటలీ కేవలం ఒక్క పెనాల్టీ కార్నర్‌నే సాధించింది. తొలి, రెండు, నాల్గో క్వార్టర్‌లో ఇరు జట్ల నుంచి గోల్స్ నమోదు కాలేదు. మనీశ చౌహాన్ మెరుపు వేగంతో పెనాల్టీ కార్నర్‌ను గోల్ గొట్టగా భారత్ 1-0తో విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో స్కాట్లాండ్‌పై ఇంగ్లాండ్ 2-0తో గెలుపొందింది. 25వ నిమిషంలో లాటీ బింగ్హామ్, 29వ నిమిషంలో డార్సీ బౌర్నీలు ఫీల్డ్ గోల్స్‌తో ఇంగ్లాండ్‌ను ఆధిక్యంలో నిలిపారు.
రెండో క్వార్టర్‌లోనే గోల్స్ కొట్టిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత ఆధిక్యం నిలుపుకుంది. స్కాట్లాండ్‌కు ఆరు పెనాల్టీ కార్నర్‌లు దక్కినా.. ఇంగ్లాండ్ గోల్‌కీపర్ సమర్థవంతంగా నిలువరించింది. నేడు జరిగే టైటిల్ పోరులో ఆతిథ్య భారత్‌తో ఇంగ్లాండ్ అమ్మాయిలు తలపడనున్నారు. అంతకముందు జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రియాపై ఉరుగ్వే 3-0తో, దక్షిణ కొరియాపై వేల్స్ 2-1తో విజయం సాధించాయి. ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్‌కు ఈ క్వాలిఫయర్స్ నుంచి మూడు జట్లు అర్హత సాధించనున్నాయి. ఫైనల్‌కు చేరుకుని భారత్, ఇంగ్లాండ్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. మూడో బెర్త్ కోసం నేడు స్కాట్లాండ్, ఇటలీ తాడోపేడో తేల్చుకోనున్నాయి. నామమాత్రపు 5-8 స్థానాల కోసం వేల్స్‌తో ఉరుగ్వే.. దక్షిణ కొరియాతో ఆస్ట్రియా నేడు పోటీపడనున్నాయి.



