– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్
– రాష్ట్రపతికి పోస్టాఫీసుల ద్వారా వినతిపత్రం
నవతెలంగాణ-కంఠేశ్వర్
రైతాంగానికి హానికరమైన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయొద్దని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ పట్టణంలోని పోస్టాఫీస్ ద్వారా రాష్ట్రపతికి లేఖలు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. వరి, గోధుమ రైతులకు ఇచ్చే బోనస్ నిలిపివేయాలని ఆర్థిక శాఖ కేరళ ప్రభుత్వానికి పంపిన లేఖను ఉపసంహరించుకోవాలని కోరారు. రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధరల అమలుకు పార్లమెంటులో మద్దతు ధరలు గ్యారంటీ చట్టం చేయాలని, రైతాంగ వ్యతిరేక విద్యుత్ బిల్లు, విత్తన బిల్లు, వీబీజీఆర్‌ఏఎంజీని రద్దు చేయాలన్నారు. రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. అమెరికా అధక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారని, భారత్‌తో వాణిజ్య ఒప్పందం అమెరికాకు మంచి లాభదాయకమని అమెరికా వ్యవసాయ శాఖ మంత్రి బ్రూకె లెస్లీ రోలిన్స్ ప్రకటించినా ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపటం లేదని విమర్శించారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే పారిశ్రామిక, వ్యవసాయ వస్తువులపై సుంకాలు పూర్తిగా రద్దు చేస్తారని తెలిపారు. ఏటా 9లక్షల కోట్ల విలువైన వస్తువులు, ఆహార పదార్థాలు దిగుమతి అవుతాయన్నారు. గోధుమలు, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ అయిన ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు ఎటువంటి సుంకాలు లేకుండా దిగుమతి అవుతాయని, మన రైతాంగం పండించిన పంటల ధరలు పడిపోతాయని తెలిపారు. గడిచిన ఏడాది పత్తిపై పన్ను ఎత్తివేసిన ఫలితంగా మన దేశంలోని టెక్స్‌టైల్ కంపెనీలన్నీ విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకుని మన రైతులు పండించిన పత్తిని కనీస మద్దతు ధరకన్నా రూ.2వేలు తగ్గించి కొన్నారని.. దాంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఒప్పందం అమలులోకి వస్తే మన దేశంలో 11కోట్ల రైతు కుటుంబాలు, 9కోట్ల పాడి రైతుల కుటుంబాలు దివాళా తీస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరప్ప, జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్, జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మణ్, ముత్తన్న, నాగలక్ష్మి, సుశీల, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేయొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


