Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeప్రధాన వార్తలుభారత్‌పై అమెరికా సుంకాలతో తీవ్రనష్టం

భారత్‌పై అమెరికా సుంకాలతో తీవ్రనష్టం

- Advertisement -

– వెంటనే ఉపసంహరించాలి
– ట్రంప్‌ సేవకుడిగా మోడీ
– తెలంగాణకు జరిగే అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్‌
– అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ లొంగొద్దు : రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– హైదరాబాద్‌లో నిరసన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలను విధించడం వల్ల తీవ్రనష్టం కలుగుతుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. అమెరికా విధించిన సుంకాలను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. భారత్‌పై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్లకార్డులను ప్రదర్శించి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ అమెరికా విధించిన సుంకాలతో భారత్‌కు తీవ్రనష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. భారత్‌ ఎగుమతులు చేసే వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలను మోపిందని వివరించారు. ఇప్పటికే ఎగుమతులు పడి పోయాయని అన్నారు. సుంకాల భారంతో విదేశాల్లో భారతీయ వస్తువులను ఎక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందన్నారు. దీంతో కొనుగోళ్లు లేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వివరించారు.

అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఫార్మా పరిశ్రమ విస్తరించి ఉందనీ, సుంకాల పెంపుతో ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌ ఐటీ సేవలకూ నష్టం కలుగుతుందన్నారు. సుంకాలు విధించడం వల్ల ఐటీ సంస్థలు నష్టపోతాయని తెలిపారు. అమెరికా సుంకాల వల్ల ఐటీ పరిశ్రమ కుదేలు అవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉందనీ, సుంకాలు విధించడం వల్ల రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆ ప్రభుత్వం ఓ పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలను చైతన్య పరిచేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ముందుకు రావాలని కోరారు. అమెరికా వస్తువులపై ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవాలంటూ మోడీ ప్రభుత్వంపై ట్రంప్‌ ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. దీన్ని అంగీకరించాలా వద్దా?అనే దానిపై మోడీ సర్కారు తర్జనభర్జన పడుతున్నదని అన్నారు. జీరో సుంకాలతో అమెరికా వస్తువులను దిగుమతి చేసుకుంటే వ్యవసాయ ఉత్పత్తులు, పత్తి, గోధుమలు, సోయాబీన్‌, డెయిరీ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. తెలంగాణ ఎక్కువ నష్టపోతుందని చెప్పారు. జన్యుమార్పిడి విత్తనాలను దిగమతి చేసుకోవాలంటూ కార్పొరేట్‌ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని విమర్శించారు.

భారతీయ, తెలంగాణ విత్తన కంపెనీలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వ్యవసాయం, ఇతర వస్తువులను దిగుమతి చేసుకోవద్దంటూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌నకు సేవకుడిగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భారత ప్రజలకు మోడీ సేవకుడిగా పనిచేయాలని సూచించారు. ట్రంప్‌ ఏం చెప్తే అది చేస్తున్నారని చెప్పారు. అమెరికా చెప్పడం వల్లే ఇజ్రాయిల్‌కు భారత్‌ మద్దతుగా నిలిచిందన్నారు. ట్రంప్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నాయకులు సవాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అమెరికాకు లొంగిపోవడమే దేశభక్తా?అని ప్రశ్నించారు. అమెరికా సుంకాలను వ్యతిరేకించడం, భారత ప్రయోజనాలను కాపాడ్డమే దేశభక్తి అని అన్నారు. అమెరికా సుంకాలను సీపీఐ(ఎం), వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. దొంగ ఓట్లు, బీహార్‌లో ఓట్ల తొలగింపుపై మాట్లాడుతున్న ప్రతిపక్ష పార్టీలు అమెరికా విధిస్తున్న టారిఫ్‌లపైనా స్పందించాలని కోరారు.

అమెరికా వస్తువుల దిగుమతిపై జీరో సుంకాలా? : జాన్‌వెస్లీ
ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనం సాగిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. సైనిక చర్యలు, ఆయుధవ్యాపారంతో దోపిడీ చేస్తున్నదని చెప్పారు. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నదని అన్నారు. కానీ అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే వస్తువులపై జీరో సుంకాలుండాలంటూ మోడీ ప్రభుత్వంపై ట్రంప్‌ ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.

ఫార్మారంగం, వ్యవసాయరంగం, లెదర్‌ పరిశ్రమ, కూరగాయలు, పాడి పరిశ్రమలకు నష్టం కలుగుతుందన్నారు. అమెరికా ఆంక్షలు విధిస్తుంటే మోడీ ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు. చైనాపై అమెరికా సుంకాలు విధిస్తే అమెరికాపై చైనా అదనపు సుంకాలను మోపి దీటైన సమాధానం చెప్పిందన్నారు. కానీ మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగి వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఇది దేశానికే అవమానకరమని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం సమంజసం కాదన్నారు. అమెరికాకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి నాగయ్య, టి సాగర్‌, ఎండీ అబ్బాస్‌, బండారు రవికుమార్‌, ఎండీ జహంగీర్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం వెంకటేశ్‌, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి సత్యంతోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad