ప్రపంచకప్ మన అమ్మాయిల సొంతం
ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగులతో గెలుపు
షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షో
ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్
స్వప్నం సాకారమైంది. మహిళల క్రికెట్‌కు మరో అగ్రజట్టు వచ్చేసింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ చాంపియన్‌గా భారత్ అవతరించింది. 2005, 2017లో ఊరించిన ఐసీసీ ప్రపంచకప్‌ను మనోళ్లు 2025లో పట్టేశారు. భారత మహిళల జట్టుకు ఇదే తొలి ఐసీసీ ప్రపంచకప్ టైటిల్ విజయం.
అమ్మాయిలు సాధించారు. అందని ద్రాక్ష అనుకున్న ఐసీసీ ప్రపంచకప్ టైటిల్‌ను దక్కించుకున్నారు. ఈ జట్టుతో విజేతగా నిలువటం సాధ్యమేనా అనుకునే దశ నుంచి భారత మహిళల క్రికెట్ దశ దిశను మార్చుతున్న జట్టు ఇదే అనే స్థాయికి హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఎదిగింది. తొలిసారి టైటిల్ పోరుకు చేరుకున్న దక్షిణాఫ్రికా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
షెఫాలీ వర్మ (87, 2/36), దీప్తి శర్మ (58, 5/39) బ్యాట్‌తో, బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత ప్రదర్శన చేశారు. షెఫాలీ, దీప్తి అర్థ సెంచరీలతో తొలుత 298 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. వికెట్ల వేటలో ఆ ఇద్దరి మాయాజాలంతో దక్షిణాఫ్రికాను 246 పరుగులకు కుప్పకూలింది. 52 పరుగుల తేడాతో భారత్ చారిత్రక విజయం సాధించింది. 2025 ఐసీసీ మహిళల ప్రపంచకప్ చాంపియన్‌గా అవతరించింది.
నవతెలంగాణ-ముంబయి
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ మన సొంతమైంది. గ్రూప్ దశలో మిశ్రమ ప్రదర్శనతో కంగారు పెట్టినా.. సెమీఫైనల్లో అసమాన రీతిలో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఆదివారం ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులోనూ అదరగొట్టింది. బ్యాట్, బంతితో పాటు ఫీల్డింగ్‌లోనూ దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించిన భారత్ తొలిసారి ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. స్పిన్నర్లు దీప్తి శర్మ (5/39), షెఫాలీ వర్మ (2/36) కలిసి ఏడు వికెట్లతో మాయాజాలం సృష్టించగా 299 పరుగుల భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా 246 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ లారా వోల్వోర్ట్ (101, 98 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో ఒంటరి పోరాటం చేసినా.. మరో ఎండ్ నుంచి సరైన సహకారం దక్కలేదు. టజ్మిన్ బ్రిట్స్ (23), సునె లుస్ (25), అనెరి డెర్క్‌సెన్ (35)లు మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది.
షెఫాలీ వర్మ (87, 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (58, 58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో రాణించారు. స్మృతీ మంధాన (45, 58 బంతుల్లో 8 ఫోర్లు), రిచా ఘోష్ (34, 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్ ఖకా (3/58) మూడు వికెట్లు పడగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షెఫాలీ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. అంతకుముందు, వర్షంతో ఫైనల్ మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ఆరంభమైంది. రిజర్వ్ డే అందుబాటులో ఉన్నా.. ఎటువంటి ఓవర్ల కోత లేకుండా ఆదివారమే అంతిమ పోరు ముగిసింది.
షెఫాలీ, దీప్తి దూకుడు
వర్షం ప్రభావిత మ్యాచ్‌లో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌పై తేమ, పదునైన పేస్‌తో ఆరంభంలో వికెట్లు ఆశించిన సఫారీలకు ఓపెనర్లు షెఫాలీ వర్మ (87), స్మృతీ మంధాన (45) చెక్ పెట్టారు. సావధానంగా ఆడిన ఓపెనర్లు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 64 పరుగులు జోడించారు. మంధాన, షెఫాలీ మెరవటంతో తొలి వికెట్‌కు భారత్ 104 పరుగులతో అదిరే ఆరంభం అందుకుంది. అర్థ సెంచరీ ముంగిట స్మృతీ నిష్క్రమించినా.. షెఫాలీ జోరు తగ్గలేదు. 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 బంతుల్లోనే అర్థ శతకం సాధించింది. సెమీస్ స్టార్ జెమీమా రొడ్రిగ్స్ (24)తో కలిసి షెఫాలీ మరో 62 పరుగుల భాగస్వామ్యంలో మెరిసింది. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో మెరిసిన షెఫాలీ వన్డేల్లో కెరీర్ ఉత్తమ స్కోరు సాధించింది. 166/1తో భారీ స్కోరు దిశగా సాగుతున్న భారత్‌ను ఖకా నిలువరించింది. వరుసగా షెఫాలీ, జెమీమా రొడ్రిగ్స్‌ను సాగనంపి సఫారీలను రేసులోకి తెచ్చింది. మిడిల్ ఆర్డర్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (20) సహా ఆల్‌రౌండర్ ఆమన్‌జోత్ కౌర్ (12) అంచనాలను అందుకోలేదు.
ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58), వికెట్ కీపర్ రిచా ఘోష్ (34) ఆఖర్లో భారత ఇన్నింగ్స్‌ను నడిపించారు. సహజశైలిలో నెమ్మదిగా ఆడిన దీప్తి వికెట్ల మధ్య చురుగ్గా పరుగులు తీసింది. 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 బంతుల్లో అర్థ సెంచరీ సాధించింది. రిచా ఘోష్ కాస్త వేగంగా ఆడింది. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో ధనాధన్ షో చూపించింది. దీంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిల్‌లో (11-40 ఓవర్లు) 4 వికెట్లకు 165 పరుగులు చేసిన భారత్.. ఆఖరు పది ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు సాధించింది. ఆరంభంలో షెఫాలీ, మంధాన… ఆఖర్లో దీప్తి శర్మ, రిచా ఘోష్‌లు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడారు. సఫారీ బౌలర్లలో ఖకా (3/58) మూడు వికెట్లతో రాణించింది.
లారా పోరాటం వృథా
ప్రపంచకప్ ఫైనల్. సఫారీ లక్ష్యం 299 పరుగులు. డివై పాటిల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం. అయినా, టైటిల్ పోరు ఒత్తిడిలో ఛేదన అంత సులువు కాదు. ఓపెనర్లు లారా వోల్వోర్ట్ (101), టజ్మిన్ బ్రిట్స్ (23) చక్కటి భాగస్వామ్యం అందించారు. తొలి వికెట్‌కు ఓపెనర్లు 52 పరుగులు జోడించారు. వికెట్ల మధ్య పరుగులో సమన్వయ లోపంతో బ్రిట్స్ రనౌట్‌గా నిష్క్రమించింది. పవర్‌ప్లే ఆఖరు ఓవర్లో భారత్ బ్రేక్ సాధించింది. ఆ తర్వాత శ్రీ చరణి మాయ చేసింది. ప్రమాదకర అన్నెకె బాచ్ (0)ను ఎల్బీగా అవుట్ చేసింది. దీంతో 62/2తో దక్షిణాఫ్రికా ఒత్తిడిలో పడింది.
ఓపెనర్ లారా వోల్వోర్ట్ ఓ ఎండ్‌లో నిలబడింది. దూకుడుగా ఆడుతూ రన్‌రేట్‌ను నియంత్రణలో ఉంచింది. సునె లుస్ (25), లారా జోడీ మూడో వికెట్‌కు 51 బంతుల్లో 52 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇక్కడే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ మంత్రాంగం పని చేసింది.
పార్ట్‌టైమ్ స్పిన్నర్ షెఫాలీ వర్మ చేతికి బంతిని ఇచ్చిన హర్మన్‌కౌర్.. వరుస ఓవర్లలో వికెట్లు రాబట్టుకుంది. లుస్ రిటర్న్ క్యాచ్‌తో నిష్క్రమించగా.. మారిజానె కాప్ (4) లెగ్‌సైడ్ షాట్‌కు వెళ్లి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చింది. షెఫాలీ వరుస ఓవర్ల వికెట్లు దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టింది. అనెరి డిర్క్‌సెన్ (35), లారా ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించి సఫారీ శిబిరంలో ఆశలు రేపారు. 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన లారా.. 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 96 బంతుల్లో సెంచరీ సాధించింది. రాధ ఓవర్లో వరుస సిక్సర్లతో చెలరేగిన డెర్క్‌సెన్.. భారత్‌ను ఒత్తిడికి గురి చేసింది. దీప్తి శర్మ మాయాజాలంతో డెర్క్‌సెన్ సహా జాఫ్టా, ట్రయాన్‌లు పెవిలియన్‌కు చేరారు. సెంచరీ తర్వాత లారా సైతం వికెట్ కోల్పోవటంతో సఫారీ ఆశలు ఆవిరయ్యాయి. 45.3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌటైంది. 52 పరుగుల తేడాతో భారత్ చారిత్రక విజయం సాధించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (5/39) ఐదు వికెట్లతో మాయ చేయగా.. షెఫాలీ వర్మ (2/36) కీలక వికెట్లతో ఆకట్టుకుంది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్ : స్మృతీ మంధాన (సి) జఫ్టా (బి) ట్రయాన్ 45, షెఫాలీ వర్మ (సి) లుస్ (బి) ఖకా 87, జెమీమా రొడ్రిగ్స్ (సి) వొల్వోర్ట్ (బి) ఖకా 24, హర్మన్‌ప్రీత్ కౌర్ (బి) మలబా 20, దీప్తి శర్మ (రనౌట్) 58, ఆమన్‌జోత్ కౌర్ (సి,బి) డిక్లర్క్ 12, రిచా ఘోష్ (సి) డెర్క్‌సెన్ (బి) ఖకా 34, రాధ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 298.
వికెట్ల పతనం : 1-104, 2-166, 3-171, 4-223, 5-245, 6-292, 7-298.
బౌలింగ్ : మారిజానె కాప్ 10-1-59-0, అయబోంగ ఖకా 9-0-58-3, మలబా 10-0-47-1, నదినె డిక్లర్క్ 9-0-52-1, సునె లుస్ 5-0-34-0, చోలె ట్రయాన్ 7-0-46-1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : లారా వోల్వోర్ట్ (బి) ఆమన్‌జోత్ (బి) దీప్తి 101, టజ్మిన్ బ్రిట్స్ (రనౌట్) 23, బాచ్ (ఎల్బీ) శ్రీచరణి 0, సునె లుస్ (సి,బి) షెఫాలీ వర్మ 25, మరిజానె కాప్ (సి) ఘోష్ (బి) షెఫాలీ వర్మ 4, సినాలో జాఫ్టా (సి) రాధ (బి) దీప్తి 16, అనెరి డెర్క్‌సెన్ (బి) దీప్తి 35, ట్రయాన్ (ఎల్బీ) దీప్తి 9, నదినె (సి) హర్మన్‌ప్రీత్ (బి) దీప్తి 18, ఖకా (రనౌట్) 1, మలబా నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (45.3 ఓవర్లలో ఆలౌట్) 246.
వికెట్ల పతనం : 1-51, 2-62, 3-114, 4-123, 5-148, 6-209, 7-220, 8-221, 9-246, 10-246.
బౌలింగ్ : రేణుక సింగ్ 8-0-28-0, క్రాంతి గౌడ్ 3-0-16-0, ఆమన్‌జోత్ కౌర్ 4-0-34-0, దీప్తి శర్మ 9.3-0-39-5, శ్రీ చరణి 9-0-48-1, రాధ యాదవ్ 5-0-45-0, షెఫాలీ వర్మ 7-0-36-2.
ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని నరెంద్ర మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ చైర్మెన్ శివసేనా రెడ్డి
శుభాకాంక్షలు తెలిపారు.
అభిమానులకు మా ధన్యవాదాలు. గ్రూప్ దశలో వరుసగా మూడు ఓటములు చవిచూసినా మాపై విశ్వాసం ఉంచారు. లారా, లుస్ మంచిగా ఆడుతున్నారు. ఆ సమయంలో షెఫాలీని చూశాను. షెఫాలీ అర్థ సెంచరీతో సత్తా చాటింది. ఆత్మవిశ్వాసంతో ఉన్న షెఫాలీకి ఓ ఓవర్ ఇవ్వాలని అనిపించింది. ఆ నిర్ణయమే మ్యాచ్ గతిని మార్చివేసింది. రెండేండ్లుగా ఈ విజయం కోసమే శ్రమించాం. ప్రపంచకప్ కప్పు కొట్టాలని సంకల్పంతో కష్టపడ్డాం, సాధించాం. ఇప్పుడు టైటిల్స్ సాధించటం అలవాటుగా మార్చుకోవటమే మా లక్ష్యం. – హర్మన్‌ప్రీత్ కౌర్, భారత కెప్టెన్
ఫైనల్లో ఈ ప్రదర్శన కోసమే నేను జట్టులోకి వచ్చినట్టుంది. ప్రపంచకప్ విజయం అనుభూతిని మాటల్లో చెప్పలేను. జట్టులో నా పాత్రపై పూర్తి స్పష్టత ఉంది. నా సహజశైలిలో ఆడమని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వెన్నుతట్టింది. ఇది నా జీవితంలో ఓ ప్రత్యేక సందర్భం. సచిన్ టెండూల్కర్‌ను గ్రౌండ్‌లో చూడగానే నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. – షెఫాలీ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
నాకు ఇది కలలా అనిపిస్తోంది. ప్రపంచకప్ ఫైనల్లో రాణించటం సంతోషంగా ఉంది. జట్టులో ఏ బాధ్యత ఇచ్చినా.. ఆస్వాదించాను. పరిస్థితులకు తగినట్టు ఆడాలని అనుకున్నాను. ఆల్‌రౌండర్ రాణించటం మాటల్లో వర్ణించలేని ఆనందంగా ఉంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును మా అమ్మానాన్నలకు అంకితం ఇస్తున్నాను. – దీప్తి శర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ (215 పరుగులు, 22 వికెట్లు)



