నిర్వహణ హక్కులు సొంతం
న్యూఢిల్లీ: భారత్ మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలవనుంది. 2030 శతాబ్ది కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులను భారత్ దక్కించుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరాన్ని వేదికగా ఎంపిక చేస్తూ కామన్‌వెల్త్ స్పోర్ట్ బాడీ బుధవారం నిర్ణయం తీసుకుంది. లక్షా 32 వేల సామర్థ్యం కలిగిన నరేంద్ర మోడీ స్టేడియంలో 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీపడిన భారత్.. ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. కామన్వెల్త్ స్పోర్ట్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ”సాంకేతిక నిర్వహణ, అథ్లెట్ల అనుభవం, మౌలిక సదుపాయాలు, పరిపాలన, కామన్వెల్త్ స్పోర్ట్ విలువలతో పొందిక వంటి విస్తృత శ్రేణి ప్రమాణాల ఆధారంగా తాము ఆతిథ్య నగరాన్ని ఎంపిక చేసినట్లు, భారత్‌లో అన్నిరకాల ప్రమాణాలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. నవంబర్ 26న గ్లాస్గోలో జరగనున్న జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే 2034 భవిష్యత్తు క్రీడల కోసం నైజీరియా ఆతిథ్య ఆశయాలకు మద్దతు ఇవ్వడానికి, వేగవంతం చేయడానికి ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి కామన్వెల్త్ స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు అంగీకరించిందని తెలిపింది.
కామన్‌వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకోవడం భారత్‌కు ఇది రెండోసారి. 2010లో న్యూఢిల్లీ వేదికగా భారత్‌లో తొలిసారి ఈ క్రీడలు జరిగాయి. 2030 గేమ్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి శతాబ్ది వేడుకలుగా జరగనున్నాయి. 1930లో తొలిసారి కెనడాలోని హామిల్టన్‌లో ఈ క్రీడలు జరిగాయి. భారత్‌కు కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణ అవకాశం దక్కడంపై కామన్‌వెల్త్ గేమ్స్ అసోసియేషన్ ఇండియా అధ్యక్షురాలు పి.టి. ఉష స్పందిస్తూ.. 2030 కామన్‌వెల్త్ గేమ్స్ భారత యువతకు ప్రేరణగా నిలుస్తాయని, ఈ క్రీడల నిర్వహణ కామన్‌వెల్త్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలపరిచే గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. కాగా, 72వ కామన్‌వెల్త్ గేమ్స్-2022 ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరగ్గా.. 2026 కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం ఆతిథ్యమివ్వనుంది. ఇక నైజీరియాలోని అబూజాకు కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్య హక్కులు దక్కకపోవడం ఇది రెండోసారి. గతంలో 2014 ఎడిషన్‌కు ఆతిథ్యం విషయంలో గ్లాస్గోకు అవకాశం దక్కింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం ఆర్థిక కారణాల వల్ల వైదొలగడంతో, గ్లాస్గో 2026 ఆతిథ్యమిచ్చేందుకు ముందుకు రాగా.. అంతకుముందు, దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరం వైదొలగడంతో 2022 క్రీడలను బర్మింగ్‌హామ్ నిర్వహించింది.