ఢాకా: ఈ ఏడాది వరుస సిరీస్‌లు, టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌తో బిజీ బిజీగా గడువనుండగా.. భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. సెప్టెంబర్‌లో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు రానున్నట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. బంగ్లాలో టీమ్‌ఇండియా పర్యటనపై బీసీసీఐ నుంచి పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీమ్ ఇండియా పర్యటన ఉంటుందా లేదా అనే అయోమయం కనిపిస్తుంది. దీనిపై బీసీసీఐ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి గత జూలైలో భారత జట్టు..బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉండగా బంగ్లాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ భద్రతా కారణాల దృష్ట్యా ఆ పర్యటనను బీసీసీఐ రద్దు చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది వైట్‌బాల్ సిరీస్ కోసం బీసీసీఐతో సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంటున్న బీసీబీ..సిరీస్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.



