ట్రంప్ పాత పాట
మోడీకి దీపావళి శుభాకాంక్షలు… థ్యాంక్స్ చెప్పిన ప్రధాని
వాషింగ్టన్ : రష్యా నుంచి భారత్ ఎక్కువ చమురు కొనుగోలు చేయబోదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో ముచ్చటించానని ఆయన చెప్పారు. ‘నేను ఈ రోజు ప్రధాని మోడీతో మాట్లాడాను. మా మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యా నుంచి ఎక్కువ చమురును ఆయన కొనుగోలు చేయబోవడం లేదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు.
రష్యా నుంచి భారత్ గతంలోనే చమురు కొనుగోలును తగ్గించింది. దానిని రాబోయే కాలంలో మరింత తగ్గిస్తుంది’ అని తెలిపారు. కాగా ట్రంప్ తాజా వ్యాఖ్యలపై మోడీ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ట్రంప్‌కు మోడీ ధన్యవాదాలు తెలిపారు. తమ మధ్య మంచి సంభాషణ జరిగిందని చెప్పారు. ట్రంప్ గతంలో కూడా ఇలాంటి వాదనే చేసినప్పటికీ భారత్ దానిని తోసిపుచ్చింది. దేశీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంధన కొనుగోళ్లు జరుపుతామని తెలిపింది.
చైనాపై మళ్లీ సుంకాలు
వాణిజ్య విధానంపై ట్రంప్ మాట్లాడుతూ చైనాపై కొత్తగా సుంకాలు విధిస్తామని ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి చైనా దిగుమతులపై 155 శాతం సుంకాలు వసూలు చేస్తామని చెప్పారు.
‘చైనాతో బాగా ఉండాలని అనుకున్నాను. అయితే చైనా అనేక సంవత్సరాలుగా మాతో కఠినంగా వ్యవహరిస్తోంది. ఈయూ, జపాన్, దక్షిణ కొరియా దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాను. మా దేశ భద్రతకు అవి గొప్ప ఒప్పందాలు. సుంకాలకు ధన్యవాదాలు….వాటితో మేము వందల బిలియన్లు…ట్రిలియన్లు సైతం పొందుతున్నాము. వాటితో అప్పులు తీర్చడం మొదలు పెట్టాం’ అని అన్నారు.
ఎవరి వాదన వారిదే
దీపావళి సందర్భంగా మోడీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పానని ట్రంప్ అంటున్నప్పటికీ ఆ సంభాషణ అనంతరం రెండు దేశాలు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి వైఖరి అవసరమని మోడీ సూచించగా వాణిజ్య ఒప్పందం, రష్యా చమురు పైనే తాము చర్చించుకున్నామని ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తున్నామని మోడీ తనకు తెలియజేశారంటూ ట్రంప్ చెప్పడం ఈ వారంలో ఇది నాలుగోసారి. ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణపై విదేశాంగ శాఖ నుంచి ఇంకా ఎలాంటి వ్యాఖ్య వెలువడలేదు. మోడీ, ట్రంప్‌లు ఈ వారాంతంలో మలేసియా వెళతారు. ఆసియాన్ సంబంధ సదస్సుల్లో పాల్గొంటారు. కాగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో పాకిస్తాన్ ప్రస్తావనే రాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.