ఫైనల్లో దక్షిణ కొరియాపై గెలుపు
హాకీ ఆసియా కప్ 2025
రాజ్‌గిర్ (బిహార్) : ఆసియా కప్ హాకీలో ఎనిమిదేండ్ల టైటిల్ నిరీక్షణకు తెరపడింది. ఆదివారం బిహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మెన్స్ హాకీ ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాపై 4-1తో భారత్ ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో నాల్గో సారి ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా..2026 హాకీ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. 2003, 2007, 2017 ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ 2025లోనూ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గ్రూప్ దశ నుంచి అజేయ రికార్డుతో చెలరేగిన హాకీ ఇండియా.. అజేయ చాంపియన్‌గా అవతరించింది.
ఫైన్లలో ఆట మొదలైన తొలి నిమిషంలోనే గోల్ కొట్టిన సుఖ్‌జిత్ సింగ్ భారత్‌ను 1-0తో ముందంజలో నిలిపాడు. దిల్‌ప్రీత్ సింగ్ 28వ, 45వ నిమిషంలో కండ్లుచెదిరే ఫీల్డ్ గోల్స్ నమోదు చేయటంతో మూడో క్వార్టర్ ఆట ముగిసేసరికి భారత్ 3-0తో. నిలిచింది. 50వ నిమిషంలో రోహిదాస్ అమిత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ మలిచి భారత్ ఆధిక్యం 4-0కు పెంచాడు. 51వ నిమిషంలో ఊరట గోల్ సాధించిన దక్షిణ కొరియా 1-4తో రన్నరప్‌గా నిలిచింది. అంతకముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చైనాపై మలేషియా 4-1తో విజయం సాధించింది.