ఇండియా…

– ప్రతిపక్షాల కూటమి పేరు ఇదే…
– 26 పార్టీల ఏకగ్రీవ నిర్ణయం
– ముంబయిలో తదుపరి భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ నూతన కూటమికి భారత జాతీయ అభివృద్ధి సమష్టి కూటమి (‘ఇండియా’) అనే పేరు ఖరారు చేశాయి. ఐ – ఇండియన్‌, ఎన్‌ – నేషనల్‌, డి – డెవలప్‌మెంట్‌, ఐ – ఇన్‌క్లూజివ్‌, ఎ – అలయెన్స్‌ (ఐఎన్‌డీఐఏ)గా వర్ణించాయి. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన ప్రతిపక్షాల సమావేశం మంగళవారం ముగిసింది. కూటమి పేరును ఇండియాగా 26 ప్రతిపక్ష పార్టీలు
ఏకగ్రీవంగా నిర్ణయించాయి.
ఈ సమావేశంలో కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, ఆప్‌, జేడీయూ, సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ, శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్‌డీ, అప్నాదళ్‌ (కే), నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఆర్‌ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయుఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ (ఎం), కేరళ కాంగ్రెస్‌ (జోసఫ్‌) పార్టీలు పాల్గొన్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఇండియా కూటమి తదుపరి సమావేశం ముంబయిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన కోఆర్డినేషన్‌ కమిటీ, దాని కన్వీనర్‌ను ప్రకటిస్తామని, ప్రచార మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ముంబయి సమావేశంలోనే ఆ ప్రక్రియ పూర్తి అవుతుందని అన్నారు. ఐఎన్‌డీఐఏ ఉద్దేశం ఐక్యంగా పోరాడటమే.అని బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.
దేశం మా కుటుంబం, దాని కోసం పోరాడుతాం :ఉద్ధవ్‌ ఠాక్రే
‘ప్రధాని నరేంద్ర మోడీ ‘కుటుంబం కోసం’ పనిచేస్తున్యాని అంటున్నారు. ‘అవును, దేశం మొత్తం మా కుటుంబం. మేము దాని కోసం పోరాడుతున్నాం”. ”ప్రజల మనస్సులలో తదుపరి ఏమి జరుగుతుందో అనే భయం ఉంది. కాబట్టి చింతించకండి. మేం ఇక్కడ ఉన్నామని వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాము. ఒక వ్యక్తి, లేదా ఒక పార్టీ దేశం కాదు. దేశం ప్రజలందరిది” . ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ (కాంగ్రెస్‌), సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం), డి.రాజా (సీపీఐ), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ (డీఎంకే), బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ (జేడీయూ), పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (టీఎంసీ), ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ (ఆప్‌), జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరెన్‌ (జెఎంఎం), లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజశ్వీ యాదవ్‌ (ఆర్జేడీ), శరద్‌ పవార్‌ (ఎన్సీపీ), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), ఉద్దవ్‌ ఠాక్రే (శివసేన), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), మెహబుబా ముఫ్తీ (పీడీపీ), వైకో (ఎండీఎంకే), దీపాంకర్‌ భట్టాచార్య (సీపీఐఎంఎల్‌), ఈఆర్‌ ఈశ్వరన్‌ (కెఎండీకే), కెఎం ఖాద్రీ మోహిద్దీన్‌ (ఐయుఎంఎల్‌), జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్‌డీ) తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీకి సమావేశంలో నేతలు నివాళుర్పించారు.
ఉమ్మడి తీర్మానం
కుల గణనను అమలు చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. సమావేశ అనంతరం 26 పార్టీలు ‘సామూహిక్‌ సంకల్ప్‌ (ఉమ్మడి తీర్మానం) విడుదల చేశాయి. ”సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. మొదటి దశగా, కుల గణనను అమలు చేయాలి” అని పార్టీలు తమ తీర్మానాన్ని ”ఒ స్వరంతో” ఆమోదించాయి. ”మైనారిటీలపై ద్వేషం, హింస” అలాగే ”మహిళలు, దళితులు, గిరిజనులు, కాశ్మీరీ పండిట్లపై పెరుగుతున్న నేరాలను” ఓడించేందుకు తాము కలిసి ఒక వేదికపైకి వచ్చామని తీర్మానంలో ప్రతిపక్ష పార్టీలు నొక్కి చెప్పాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన భారతదేశ ఆలోచనను కాపాడేందుకు పార్టీలు తమ ధృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశాయి. ”మన గణతంత్ర స్వరూపంపై బీజేపీ క్రమపద్ధతిలో తీవ్రంగా దాడి చేస్తోంది. దేశ చరిత్రలో మనం అత్యంత కీలకమైన దశలో ఉన్నాము. భారత రాజ్యాంగ పునాది స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, సామాజిక న్యాయం, సమాఖ్యవాదం ఒక పద్దతి ప్రకారంగా, భయానకంగా అణగదొక్కబడుతున్నాయి” అని విమర్శించాయి.
దేశం కోసం..
‘బెంగళూరు సమావేశానికి హాజరైన పార్టీల మధ్య ఉన్న లౌకిక ప్రత్యామ్నాయ అవగాహన ఏదైతే ఉందో అది ఇండియా (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌)గా రూపుదిద్దుకుంది. ఇది ప్రధానమైనది. రాజ్యాంగ లౌకిక, ప్రజాతంత్ర లక్షణాలను దెబ్బతీసేందుకు మోడీ సర్కార్‌ పాల్పడుతున్న వినాశకర చర్యల నుంచి దేశాన్ని పరిరక్షించుకోవా ల్సిన ఆవశ్యకత ఏర్పడింది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ అధికారం నుంచి బీజేపీని గద్దె దించాల్సిందే. ఈ దిశగా అన్ని పార్టీలూ సహకరించుకోవాలని సమావేశంలో నిర్ణయించాం.
ఏచూరి
భారత్‌ గొంతు కోసం జరుగుతున్న పోరాటం
” ఇండియా అనే భావవపై దాడి జరుగుతోంది. కోట్లాది మంది భారతీయుల నుంచి ఇండియా గొంతును లాక్కొని నరేంద్ర మోడీ సన్నిహితులైన కొంతమంది వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ఇది భారత్‌ గొంతు కోసం జరుగుతున్న పోరాటం. అందుకే ఇండియా పేరును ఖరారు చేశాం. ఎన్‌డీఏ వర్సెస్‌ ఇండియా, నరేంద్ర మోడీ వర్సెస్‌ ఇండియా, ఇండియా వర్సెస్‌ బీజేపీ సిద్ధాంతం మధ్య పోరాటం ఇది. ఒక సమూహంగా తాము భారత రాజ్యాంగాన్ని, ప్రజల గొంతును పరిరక్షిస్తున్నాం. భారత్‌ అనే భావనకు ఎదురు నిలబడితే ఎవరు గెలుస్తారో మనందరికీ తెలుసు” . దేశం పట్ల మన ధృక్పథాన్ని వివరించే ఒక ‘యాక్షన్‌ ప్లాన్‌’తో ముందుకు రావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. నిరుద్యోగం విస్తరిస్తోంది. ధరలు పెరుగుతున్నాయి. దీని గురించే మా పోరాటం. భారతదేశ ఆలోచనను రక్షించడానికి సర్వశక్తులు ఒడ్డుతాం. వారు మన దేశంపై దాడి చేస్తున్నారు. దేశ సంపద కొందరి చేతుల్లోకి వెళుతోంది. ”ఈ పోరాటం కేంద్రం, ప్రతిపక్షాల మధ్య కాదు. ఇది అణచివేయబడుతున్న భారతదేశం గొంతు కోసం జరుగుతున్న పోరాటం. అందుకే మేము ఇండియా పేరును ఎంచుకున్నాం”
– రాహుల్‌ గాంధీ
ఎన్డీఏ.. ఇండియాను చాలెంజ్‌ చేయగలదా?
మా కూటమిని ఇండియా అని పిలుస్తాం. ఇంగ్లీష్‌లో ఇండియా, భారత్‌ అని పిలవొచ్చు. ఎన్డీఏ, ఇండియా కూటమిని సవాలు చేయగలదా? మాతృభూమిని తాము ప్రేమిస్తాం. ఈ దేశ భక్తులం మేమే. దేశం కోసం, ప్రపంచం కోసం, రైతుల కోసం, అందరి కోసం ఉన్నాం. హిందూవులు, దళితులు, మైనార్టీలు, రైతులు, బెంగాల్‌, మణిపూర్‌కు బీజేపీతో ముప్పు పొంచి ఉన్నది. ప్రభుత్వాలను కొనడం, అమ్ముడే బీజేపీ పని .
-మమతా బెనర్జీ
నవ భారతం కోసమే..
తొమ్మిదేండ్ల కితం భారతీయులు నరేంద్ర మోడీకి ఓటేయడంతో దేశానికి సేవ చేసే అవకాశం వచ్చింది. అయితే ఈ తొమ్మిదేండ్లలో ఒక్క రంగం కూడా పురోగతి సాధించలేదు. ఈ 26 పార్టీలు నవ భారతం కోసం కలలు కంటున్నాయి.
– కేజ్రీవాల్‌
పీఎం పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు
ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్‌ పార్టీకి ఆసక్తి లేదు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే మా పార్టీకి మక్కువ. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయి. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావు. ప్రజలను కాపాడటం కోసం వాటిని పక్కన పెట్టవచ్చు. ఈ సమావేశానికి హాజరైన 26 పార్టీలకు తగినంత రాజకీయ బలం ఉన్నది. 11 రాష్ట్రాల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్నాయి.
– ఖర్గే

Spread the love