Sunday, March 15, 2026
E-PAPER
Homeసోపతిబ్రిటిష్‌వారి బాటలో భారతీయ కళాకారులు

బ్రిటిష్‌వారి బాటలో భారతీయ కళాకారులు

- Advertisement -

యూరోపియన్లు నియమించిన స్కూళ్లలో ఉత్తీర్ణులయిన భారతీయ కళాకారులు, వారే ఆ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా చేరటమే కాక, యూరప్‌ వెళ్లి కొంతమంది మరిన్ని మెళకువలు నేర్చుకుని భారతీయ ఆధునిక కళా ప్రపంచానికి మరిన్ని రంగులు దిద్దనారంభించారు.

కుందన్‌లాల్‌ మిస్త్రీ (1850-1930) బాంబే ఆర్ట్‌ స్కూల్‌లో 1889లో చేరి సులభంగా డ్రాయింగ్‌ గీయగల అతని ప్రతిభకి బంగారు పతకం కూడా గెలుచుకున్నాడు. ఆపై ఇంగ్లండులోని స్లేడ్‌ స్కూల్‌కి వెళ్లి మరిన్ని మెళకువలు, రూపాలు దిద్దటం నేర్చుకుని రాజస్థాన్‌లో మేవారి ఆస్థాన కళాకారుడిగా చేరాడు. మేవార్‌ రాజులు సంప్రదాయ కళలలో అభిరుచి కలిగినవారు. కుందన్‌లాల్‌ భారతీయ విషయాలు, సంప్రదాయ కళలకు మల్లే చిత్రించాడనిపించినా, అతను బ్రిటీష్‌వారి వద్ద నేర్చిన చిత్రకళాభ్యాసమూ అతని చిత్రాలలో కనిపిస్తాయి. భారతీయ కళా ప్రపంచంలో ఇలాంటి ఒక కొత్త బాణి మొదలైంది. ఎన్‌.ఎన్‌.రైటర్‌, నవరోజి అనే చిత్రకారులు యూరప్‌లో శిక్షణ పొందినా, వారికి పని ఎక్కడా దొరక్క ఇబ్బంది పడ్డారు. ఇలాంటి వారూ కనిపిస్తారు ఆధునిక కళా శిక్షణ పొందినవారు. ఇందుకు మరిన్ని కారణాలున్నాయి. ఆస్థాన రాజులు, ధనవంతులు ఇచ్చే ప్రాపకం, సహాయం తగ్గినాయి ఆనాడు. సమాజంలోనూ కళలపై ఆసక్తి మొదలవడంతో కళాకారులు వారు అభ్యాసం చేసిన కళలని ప్రదర్శనలు ఏర్పాటు చేసి విక్రయించేవారు. ఈ మార్పుకు దోహదం చేసింది బ్రిటిష్‌వారేను. వారు కళా పాఠశాలలో నేర్పే కళను కళా మ్యాగజైన్లు, పత్రికల ద్వారా విషయాలు ప్రచురించటం, కళాశాల విద్యార్థుల చిత్రాలు, శిల్పాలను ప్రదర్శనలు ఏర్పాటు చేయటంతో ప్రజలలో వీరి కళాపద్ధతుల సమాచారం చేర మొదలెట్టింది. ఆపై కళా వివేచకులు పత్రికలలో ఈ కళల గురించి వారి ఉద్దేశ్యాలు రాయ మొదలెట్టారు. ఈ మార్పులకు కొంత మంది కళాకారులు నిలదొక్కుకున్నారు, కొంత మంది నిలబడలేక పోయారు.

ఇలా ఆధునిక కళల గురించి ప్రబలటానికి మరెన్నో కారణాలు జతకూడాయి. మనదేశంలోనూ యూరోపియన్లు కళా సంస్థలు అని మొదలుపెట్టారు. ఇందు కళలపై ఆసక్తిగలవారు సభ్యులవచ్చు. కళా విషయాలపై చర్చించవచ్చు. ఈ సంస్థలు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఇదే పద్ధతిన భారతీయులూ తమ కళా సంస్థలని మొదలుపెట్టారు. 1838లో బెంగాలీలు తమ కళా సంస్థని మొదలుపెట్టగా, ఆపై ముంబాయిలో కళా సంస్థ మొదలైంది. మద్రాసు, సిమ్లా వంటి కళా సంస్థలు మరికొన్ని మొదలవగా వీటికి ఇంగ్లీషు వారి ఆశీర్వాదం వుండటమే కాక వారూ పాల్గొన మొదలుపెట్టారు. ఇలాంటి మరిన్ని కళాసంస్థల ప్రదర్శనలు మొదలయ్యాయి. అయితే ఈ సంస్థలనూ ఇంగ్లీషువారే చేతిలోకి తీసుకుని భారతీయుల కళలకు దేశీయ లేదా స్థానిక కళలని పేరుపెట్టి వేరే విభాగంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసేవారు. స్థానికులకు కళాసిద్ధాంతాలు తెలియవు అనీ, ఇంగ్లీషు వారి బేధ భావం తెలియచెప్పేట్టుగా వుండేది వారి ఏర్పాటు. ఈ ప్రదర్శనల్లో బ్రిటిష్‌ వారి ఆర్మీ ఆఫీసర్లు, వారి భార్యలు, యూరోపియన్‌ ఆర్ట్‌ టీచర్ల కళావిభాగం వేరుగా వుండేది. ఎలాగైనా స్థానిక కళాకారులకు వారి సిద్ధాంతాల ప్రకారం మంచి రుచిగల కళలు నేర్పాలని వారి పట్టుదల. ప్రదర్శనలలో ఈ భేదభావం భారతీయులను ఎంతో చిరాకుపరిచింది.
ఈ ప్రదర్శనలలో బరోడా ఆస్థాన కళాకారుడు హంసాజీ రఘునాథ్‌, ట్రావెంకూర్‌ ఆస్థాన కళాకారుడు రామస్వామినాయుడి కళాఖండాలు ఎక్కువగా కన్పించడం మొదలుపెట్టాయి. వీరి చిత్రంలోనూ దేశీయ విషయాలపై పాశ్చాత్య పద్ధతిలో చిత్రం చిత్రించే తీరు కనిపించింది.
రాజారవివర్మ, పేరుమోసిన ఆనాటి చిత్రకారుడు కూడా ఈ ప్రదర్శనలో తన చిత్రాలను ప్రదర్శించాడు. ఆయన చిత్రాలు, ప్రదర్శనలు, ఆయన పేరు గురించి మరోసారి మరింత విపులంగా మరో వ్యాసంలో మనం సంభాషించాలి.

14 ఆర్ట్‌ స్కూళ్ల విద్యార్థులు, 66 చిత్రాలు, డ్రాయింగులు, 122 గ్రాఫిక్‌ ప్రింటులు ప్రదర్శించారు. ఆర్ట్‌ స్కూల్లో ఇంకా చేరని గంగాధర్‌డే కూడా ఇందులో ప్రదర్శించాడు. 1879లో జరిగిన ఈ ప్రదర్శన ప్రత్యేకత ఇందులో వివాహితులైన 25 బెంగాలీ స్త్రీ కళాకారిణులు పాల్గొన్నారు.
ఈ కలకత్తా కళాప్రదర్శన తరువాత 1889లో కలకత్తా ఆర్ట్‌ సొసైటీ స్థాపితం అయింది. కళా సంస్థలు పెరిగాయి. బొంబాయి, కలకత్తా మధ్య ప్రదర్శనలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. పాశ్చాత్య చిత్రాలు అనుకరించి వేసిన కాపీలకు ఆదరణ పెరిగింది. 1876లో కలకత్తాలో అంతకుముందు గొప్ప కళాకారులు వేసిన పాశ్చాత్య చిత్రాలు ప్రదర్శించే శాశ్వత ప్రదర్శనశాల నిర్మించారు. ఈ ఆలోచన సర్‌రిచార్డ్‌ టెంపుల్‌ అనే బెంగాల్‌ గవర్నర్‌, లార్డ్‌ నార్త్‌ బ్రూక్‌ అనే వైస్రారుది. ఈ విధమైన పథకాలపై పథకాలతో పాశ్చాత్య కళలు, వారి కళా సంప్రదాయాలను, యూరోపియన్లు భారతీయుల ఆలోచనలపై ప్రభావం తీసుకురాగలిగారు.
ఆ సమయంలో ప్రకృతి దృశ్యాలు లేదా లాండ్‌స్కేపు చిత్రాలకు తక్కువ ఆదరణ వుండేది. ఫొటో గ్రాఫులలా నిజమనిపించే పోట్రేటులు చిత్రించడం, యూరోపియన్లు నేర్పిన పద్ధతి. ఇక్కడ ఆదరణ పెరిగింది. పోట్రేటు చిత్రం చిత్రించడం మటుకే కాదు, నిజమనిపించే శిల్పం చేయటమూ ప్రసిద్దికెక్కింది. ముఖ్యంగా బొంబాయిలో, కలకత్తా కంటే చాలామంది శిల్పంపై పనిచేశారు. బి.వి.తాలిమ్‌ చాలామంది కాంగ్రెస్‌ ప్రతినిధుల, యూరోపియన్‌ ఆఫీసర్ల నిలువెత్తు విగ్రహాలు చేశాడు.

బాంబేసెలన్‌ కళాకారులు : ఈ భారతీయ ఆధునిక కళల మొదటిదశ 19, 20 శతాబ్దాల మధ్యకాలంలో, యూరోపియన్లు నేర్పించిన ఫొటోగ్రఫీలాంటి నిజమనిపించేలా, అకడమిక్‌ పద్ధతి, అంటే వారి ఆర్ట్‌ స్కూళ్లలో నేర్పించిన పద్ధతిలో కళలను సృజించిన కళాకారులను సెలన్‌ కళాకారులుగా పేరు పిలువబడింది. ఇది ఫ్రెంచ్‌ పేరు. కొంతమంది బాంబే కళాకారులు ఈ పద్ధతిలో పేరు పొందారు.
పేస్టొన్జీ బొమ్మంజీ (1851- 1938) అనే పార్సీ కళాకారుడు, బాంబే ఆర్ట్‌ స్కూల్‌ నుండి వచ్చిన మొదటి పోట్రేట్‌ చిత్రకారుడిగా గుర్తించవచ్చు. ఇతను వైస్రారు బంగారు పతకం అందుకున్నాడు. ఇతను శిల్పకారుడు అవాలనుకున్నా, అజంతా కుడ్య చిత్రాలను చూసి చిత్రాలుగా చిత్రించిన తీరు గ్రిఫిత్‌ అనే బాంబే ఆర్ట్‌ స్కూల్‌ అధ్యాపకుడి దృష్టికి వెళ్లి, ఆ స్కూల్‌కి తన తరువాత అధ్యాపకుడిగా నియమించాడు. ఇతను ఆ స్కూల్‌కి మొదటి భారతీయ అధ్యాపకులలో ఒకరైనాడు. పార్సీలు ఇచ్చిన ప్రేరణ, ఆధారంతో మంచి కళాకారుడిగా, అభ్యాసం చేసి పేరు తెచ్చుకున్నాడు.
మాంచర్‌షా పీఠావాలా (1872 – 1937) సూరత్‌ (గుజరాత్‌) నుండి, బాంబే ఆర్ట్‌ స్కూల్‌లో గ్రిఫిత్‌ దగ్గర విద్యార్థిగా కళలు నేర్చుకుని, మరోమంచి పోట్రేట్‌ కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. జార్జ్‌ బర్డ్‌ ఉడ్‌ అనే యూరోపియన్‌ ఇతని పోట్రేటులు, ఇంగ్లీషు పోట్రేటుల కంటే బాగున్నాయని పొగిడాడు.
ఆబాలాల్‌ రెహమాన్‌ (1860 – 1931) మంచి కళాకారుడైనా బాంబేలో నిలదొక్కుకోలేక తన తండ్రి కొల్లాపూర్‌ ఆస్థానంలో గుమాస్తాగా పనిచేస్తున్నందున, తానూ ఆ ఆస్థాన కళాకారుడిగా చేరాడు. అలాగే వెండి, బంగారం డిజైన్ల పని కూడా నేర్చుకున్నాడు. అతని ప్రకృతి లఘుచిత్రాలు గుర్తుపెట్టుకోదగినవి. డబ్బు ఇబ్బందుల వలన పొటోగ్రఫీ కూడా చేశాడు.
మహదేవ విశ్వనాథ ధురంధర్‌ (1867 – 1944) పేరు ప్రఖ్యాతులు గడించిన ఈ కళాకారుడూ కొల్హాపూర్‌ నుండే. ఇతను తన పట్టుదల కళలపై ధ్యాసతో అందరినీ మెప్పించాడు. తండ్రి మరణిస్తే ఇతని చదువు ఆగిపోకుండా బాంబే ఆర్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గ్రీన్‌వుడ్‌, బాలికల పాఠశాలలో చిత్రం నేర్పే అధ్యాపకుడిగా ఉద్యోగం ఇప్పించాడు. ఇతను ఆపై ఆ స్కూల్‌ డైరెక్టర్‌ కూడా అయ్యాడు. అజంతాపై పనిచేసిన గ్రిఫిత్‌ రాసే వ్యాసాలకు ఇతను చిత్రాలు వేయగా అవి జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్‌లో ప్రచురితమైనాయి. కొత్త ఢిల్లీ సెక్రటేరియట్‌పై మూరల్‌ వంటి పెద్ద పనులూ, లఘుచిత్రాలూ వేశాడు. సరైన రూపం చిత్రించడం కోసం ఆయన ఆనాడే ఫొటోగ్రాఫ్‌లు చిత్రానికి ఆధారంగా ఉపయోగించేవాడట.

ఎంటోనియో గ్జేవియర్‌ త్రినదాదె (1870 – 1935) గోవానుండి వచ్చి బాంబే ఆర్ట్‌ స్కూల్‌లో పట్టా పొంది రాజాదీనదయాల్‌ 1896లో ఫొటో స్టూడియో తెరిచాక, అక్కడ కొంత కాలం పనిచేశాడు. ఆ సమయాన బ్రిటీష్‌ వారు క్రైస్తవులకు, మిశ్రమ వర్గం వారికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇతనికి ఆర్ట్‌ స్కూల్లో ఉద్యోగం దొరికింది. ఇతను పోట్రేట్‌లు బాగా వేయడమే కాక, క్రైస్తవ విషయాలు, ప్రకృతి చిత్రాలు వేసి మంచి ఆదాయంతో నిలదొక్కుకున్నాడు.
ఆర్చి బాల్ట్‌ హర్మన్‌ ముల్లర్‌ (1878 – 1952) తండ్రి కొచ్చిన్‌ వాస్తవ్యుడు అయిన జర్మనీ ప్రొటెస్టెంట్‌, తల్లి భారతీయ కాథొలిక్‌. ఇతను మద్రాస్‌ ఆర్ట్‌ స్కూల్లో పట్టా పొందాడు. ముందు తన సోదరుడి ఫొటోగ్రఫీ స్టూడియోలో పనిచేశాడు. ఆపై బొంబాయి చేరాడు. తన ఆపార్ట్‌మెంట్‌లో చిత్రలేఖనం క్లాసులు నడిపాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో, ఇతను జర్మన్‌ అవటం వలన, చిత్రాలు గీయటం వలన రిజర్వ్‌ ఫోర్స్‌లో చేరాడు. రామాయణ, మహాభారత చిత్రాలు వేసి భారతీయుడనని తెలిపాడు. ఆపై ఆదాయం కోసం 1922 లో బికనీర్‌ ఆస్థానంలో వేట చిత్రాలు వేయటానికి చేరినా, ఎక్కువ కాలం అలా చేయలేక బొంబాయి చేరినా, మళ్లీ ఆదాయం కోసం జోధ్‌పూర్‌ ఆస్థానంలో చాలా కాలం పనిచేశాడు.
సామ్యుల్‌ రహమాన్‌ (1880 – 1965) పూనాకి చెందిన ఈ ఇస్రాయిలీ, బొంబాయి ఆర్ట్‌ స్కూల్‌లో చదువుకుని లండన్‌ వెళ్లాడు. ఆపై రాయల్‌ అకాడమీలో చేరిన రెండవ భారతీయ విద్యార్థి. మొదటి విద్యార్థి రుస్తమ్‌ శిశోడియా అనే పార్సీ. రహమాన్‌ తిరిగి వచ్చి బరోడా ఆస్థానంలో కళాకారుడిగా, కళల సలహాదారుగా పనిచేశాడు. 1908 – 18 మధ్య గైక్వాడ్‌ కుటుంబ 5 పోట్రేటులు వేశాడు.
గణపత్‌ రావ్‌ మాత్రే (1876 – 1947) సెలన్‌ కళాకారులు ఎవ్వరు శిల్పం తయారీలో ముందడుగు వేయని సమయంలో ఇతను చిత్రం నేర్వ బాంబే ఆర్ట్‌ స్కూల్‌ చేరినా తనంతట తానుగా శిల్పం నేర్చుకున్నాడు. ‘టు ద టెంపుల్‌’ ఇతని శిల్పం చాలా పేరు పొందింది. 1900 లో చేసిన ‘సరస్వతి’ శిల్పంకి ఇంగ్లీషు కిరీటం తొడిగి, గిటారు వాయించే శిల్పం పారిస్‌ ప్రదర్శనలో బహుమతి పొందింది. ‘మెమోరియల్‌ స్టాచ్యూ ఆఫ్‌ క్వీన్‌ విక్టోరియా’ అనే ఇతని శిల్పం 1910లో అహ్మదాబాద్‌లో నిలుపబడింది. ‘పార్వతి శబరిగా’ అనే మరో శిల్పం 1903లో ఢిల్లీలో ప్రదర్శించబడింది. ఇతని శిల్పాలలో గ్రీకు శిల్ప పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి.
కలకత్తా అకడమిక్‌ లేదా సెలన్‌ కళాకారులు : కలకత్తా కళాకారులు కొందరి పేర్లు మన జాబితాలో తెలుసుకోవలసినవి వున్నాయి.
ఆనంద ప్రసాద్‌ బాగ్చీ (1849 – 1905) కలకత్తా ఆర్ట్‌ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఈ చదువుని గౌరవంగా లెక్కించడం లేక తండ్రి ఒద్దన్నా చేరి చదువుకుని, అభ్యసించి బంగారు పతకం సంపాదించాడు. ఇతను పోట్రేట్‌ చిత్రకారుడు అలాగే గ్రాఫిక్‌ ప్రింట్‌ మేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. దురంధర్‌ కంటే ముందే ఇతను బొంబాయి ఆర్ట్‌ స్కూల్‌కి అధ్యక్ష పదవిలో బోధించాడు. ఇతను శిల్ప పుష్పాంజలి అనే బెంగాలీ పత్రిక ప్రచురించి, దానిని స్వదేశీ భావాలకు వేదిక చేశాడు. కలకత్తా ఆర్ట్‌ స్టూడియోని కలకత్తాలో తెరిచాడు.

బామపాద బందోపాధ్యాయ (1851 – 1932) కలకత్తా ఆర్ట్‌ స్కూల్‌లో చేరి, వారు నేర్పే తైలవర్ణ చిత్రాల పద్ధతికి నిరాశ చెంది, ప్రమథాలాల్‌ మిత్రా వద్ద, ఆపై కార్ల్‌ బేకర్‌ అనే జర్మన్‌ కళాకారుడి వద్ద పని నేర్చుకున్నాడు. ఆపై అలహాబాద్‌, లాహోర్‌ ధనవంతుల వద్ద కళాకారుడిగా పని చేసి, ఆపై కలకత్తాలో స్తిరపడ్డాడు.
జామినీ ప్రొకాష్‌ గాంగూలీ (1876 – 1953) ఇతను టాగోర్‌ కుటుంబ దగ్గర బంధువు. అబనీంద్రనాథ్‌ టాగూర్‌ని చూసి, కళలపై ఆసక్తి పెంచుకున్నా, తనదంటూ ఒక పద్ధతిని అలవరచుకున్న కళాకారుడు. ఆర్ట్‌ స్కూల్‌లో చదవకపోయినా, గంగాధర్‌డే వద్ద, సి.జి. పాల్మర్‌ వద్ద తైలవర్ణ చిత్రాలు నేర్చిన కళాకారుడు. ఇతని ప్రకృతి దృశ్యాలు, కవితలకు మల్లే సుతిమెత్తగా వుంటాయని పేరుపొందాడు. గంగూలీని కలకత్తా ఆర్ట్‌ స్కూల్‌కి ఉపఅధ్యక్షుడిగా ఎంపిక చేసిన తరువాత అబనీంద్రనాథ్‌ రాజకీయాల వలన, పదవి ఒదిలేసి బయటకు రావలసి వచ్చింది.
బెంగాలీ కళాకారుల ఇటలీ ప్రయాణం : విద్వత్తు వున్న కళాకారులు ఇటలీలో శిక్షణ పొందాలని ఎదురు చూసేవారు. 1886లో చెవలియర్‌ ఓలింటో ఘిలార్డీ అనే ఇటలీ అధ్యాపకుడు కలకత్తా ఆర్ట్‌ స్కూల్‌కి అధ్యాపకుడిగా వచ్చి, వీరి ఈ కల సాధ్యం చేశాడు. రోహిణి కాంతానాగ్‌, శశీ హెష్‌ (హైదరాబాద్‌కి చెందిన కి.శే.కవితా దేవుస్కర్‌ ఈయన మనుమరాలు) ఫణీంద్రనాథ్‌ బోస్‌ వంటి వారికి ఈ కల నిజమైంది. ఫణీంద్రనాథ్‌ (1888 – 1926), పర్సీ పోర్ట్స్‌ మౌత్‌ వద్ద శిల్పం నేర్సుకుని రోడా అనే ప్రఖ్యాత శిల్పకారుణ్ణి మెప్పించాడు. బ్రిటన్‌ లో కొత్త తరహా శిల్పం అనే ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. అందు చిన్న శిల్పం అన్ని వంపులతో, కండరాలతో చేయాలి అనేది సవాలు. అలా ఎన్నో శిల్పాలు చేసాడు. బరోడా రాజు కోసమూ ఎన్నో శిల్పాలు చేసాడు. ఇతని పనిలో భారతీయ మనసు పాశ్చాత్య పనితనం కలసి ఉన్నాయి. ఆపై ఎడిన్బర్గ్‌ వెళ్ళిపోయాడు. ఈ సమయానికి భారతీయ కళాకారులు తూర్పు పడమర కళల వారధులై భారతీయ ఆధునిక కళలకు మరో మెట్టు కట్టారు.

డా||యమ్‌.బాలామణి, 8106713356

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -