Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుతీవ్ర సంక్షోభంలో భారత ఎగుమతులు

తీవ్ర సంక్షోభంలో భారత ఎగుమతులు

- Advertisement -

– యూఎస్‌ నుంచి నిలిచిపోయిన ఆర్డర్లు
– సూరత్‌, తిరుపూర్‌లో ఆగిన ఉత్పత్తి
– రూ.4 లక్షల కోట్ల ఎక్స్‌పోర్ట్స్‌పై ప్రభావం
– ప్రమాదంలో మూడు లక్షల ఉద్యోగాలు
– దిక్కుతోచని స్థితిలో రొయ్య రైతులు
– జీడీపీ పతనమే : ఏజెన్సీలు
నవ తెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌

భారత్‌ తమ మిత్ర దేశమంటూనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వేసిన టారిఫ్‌ పిడుగు మన దేశ ఆర్థిక వ్యవస్థను గడ్డు పరిస్థితుల్లోకి నెడుతోంది. ఆగస్టు 27 నుంచి భారత్‌పై అమల్లోకి వచ్చిన 50 శాతం టారిఫ్‌లు దేశ ఎగుమతులను తీవ్ర సంక్షోభానికి గురి చేస్తున్నాయి. ట్రంప్‌ చర్యలను అడ్డుకోవడంలో ప్రధాని మోడీ విఫలం కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ఉత్పత్తులతోనూ పోటీపడలేని పరిస్థితి నెలకొనడం తీవ్ర ఆందోళకరం. ట్రంప్‌ చర్యలతో ఆ దేశానికి ముఖ్యంగా టెక్స్‌టైల్‌, ఆభరణాలు, ఆటోమొబైల్‌, సముద్ర ఉత్పత్తులు, ఫర్నీచర్‌, తోలు, సిరామిక్స్‌, కెమికల్స్‌, కార్పెట్స్‌ తదితర రంగాల భారత ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికే సూరత్‌, తిరుప్పూర్‌, నోయిడాలోని వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తి ఆగిపోయింది. అభరణాలు, వజ్రాల తయారీదారులు నిలిచిపోయిన స్టాక్‌ విక్రయాలపై దృష్టి పెట్టడంతో తాత్కాలికంగా తయారీని తగ్గించారు. ఈ పరిణామాలు లక్షలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేశాయి. మరోవైపు ఆంధప్రదేశ్‌లోని రొయ్యల రైతుల పరిస్థితి దిక్కుతోచకుండా తయారయ్యింది.

భారత్‌పై ట్రంప్‌ విధించిన అధిక సుంకాలు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని స్వయంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. అధిక టారిఫ్‌లతో 48.2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులపై ప్రతికూలత నెలకొందని వెల్లడించాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా సుంకాలతో భారత ఎగుమతులు ఇప్పటికే గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్‌ నుంచి జులై మధ్య భారత్‌ నుంచి 8 దేశాలకు ఎగుమతుల్లో ప్రతికూలత చోటు చేసుకుంది. భారత్‌ నుంచి అత్యధికంగా నెదర్లాండ్స్‌కు 21.2 శాతం ఎగుమతులు పడిపోయాయి. బ్రిటన్‌కు చేసే ఎగుమతులు 11.2 శాతం, సింగపూర్‌కు ఎగుమతుల్లో 11.8 శాతం, సౌదీ అరేబియా 11.8 శాతం, సౌత్‌ ఆఫ్రికా 16.3 శాతం, ఇటలీ 9.2 శాతం, ఫ్రాన్స్‌కు 17.3 శాతం, మలేషియాకు 28.8 శాతం చొప్పున భారత ఎగుమతులు క్షీణించగా, అమెరికా అధిక టారిఫ్‌లు మరింత తిరోగమనాన్ని పెంచాయి.

బంగ్లాదేశ్‌తోనూ పోటీ పడలేం..!
భారత్‌పై అమెరికా మోపిన అధిక టారిఫ్‌ల వల్ల కనీసం బంగ్లాదేశ్‌, వియత్నాం లాంటి చిన్న దేశల ఉత్పత్తులతో పోటీ పడలేని పరిస్థితి నెలకొందని ఎగుమతిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్‌ కొనుగోలుదారులు ఆర్డర్లు నిలిపేస్తున్నారని పరిశ్రమల బాడీ ఎఐపిసి వర్గాలు పేర్కొన్నాయి. క్లయింట్లు ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారనీ, ఈ పరిస్థితి చిన్న తరహా వ్యాపారాలకు ఉపాధి నష్టాలు, ఫ్యాక్టరీ మూసివేతలు, ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చని ఎఐపిసి హెచ్చరించింది. భారత్‌పై టారిఫ్‌లు పాకిస్తాన్‌తో పోల్చితే 2.6 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

రొయ్యలపై పెట్టుబడి రాని పరిస్థితి..
అమెరికా విధించిన అధిక సుంకాలు రొయ్యల రైతులకు శరాఘాతంగా మారాయి. 50 శాతం టారిఫ్‌లకు అదనంగా 5.76 శాతం కౌంటర్‌ వెయిలింగ్‌ డ్యూటీ, 3.96 శాతం యాంటీ డంపింగ్‌ డ్యూటీలతో మొత్తం సుంకం 60 శాతానికి ఎగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 6.5 లక్షల అక్వా రైతులు, ఈ పరిశ్రమపై ఆధారపడిన దాదాపు 40 లక్షల మంది జీవనోపాధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశం మొత్తంలో 241 అక్వా ఎగుమతిదారులుంటే, అందులో 171 మంది ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. భారత రొయ్యల ఎగుమతిలో రాష్ట్రం 60 శాతం వాటాను కలిగి ఉంది. అమెరికా టారిఫ్‌లతో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు, ఎగుమతిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ తాజా సుంకాలతో ఆంధ్రప్రదేశ్‌ రొయ్యల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అన్ని కార్యకలాపాలు స్తంభించాయని అంటున్నారు.

డైమాండ్‌ పాలిషర్ల ఆదాయం 30 శాతం పతనం : క్రిసిల్‌
ట్రంప్‌ టారిఫ్‌లతో భారతీయ డైమండ్‌ పాలిషర్ల ఆదాయం 28-30 శాతం పడిపోనుందని ప్రముఖ రేటింగ్‌ ఎజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. రత్నాలు, ఆభరణాలపై విధించిన 50 శాతం సుంకాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఈ పరిశ్రమ ఆదాయం 28-30 శాతం మేర క్షీణించి 12.50 బిలియన్‌ డాలర్లకు పరిమితం కావొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం ఏడాది ఈ రంగం ఆదాయం 16 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ పరిశ్రమలో ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉన్నాయనీ, అధిక టారిఫ్‌లు మరింత దెబ్బతీస్తున్నాయని హెచ్చరించింది. భారతీయ పాలిష్ట్‌ డైమాండ్‌ పరిశ్రమ ఆదాయంలో 80 శాతం ఎగుమతుల నుంచే వస్తోందనీ, అందులోనూ అమెరికా కీలక మార్కెట్‌గా ఉందని తెలిపింది.

6 శాతం దిగువకు జీడీపీ.. : నొమురా
యూఎస్‌ చర్యలతో భారత జీడీపీ అంచనాలకు మించి పడిపోతోందని ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ ఏకంగా 5.8 శాతానికే పరిమితం కావొచ్చని జపాన్‌కు చెందిన ఫైనాన్షియల్‌ సంస్థ నొమురా విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంచనా 6.2 శాతంగా ఉంది. రిజర్వుబ్యాంకు ఏకంగా 6.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. దీంతో పోల్చితే నొమురా అంచనాలు తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి.

ఉత్పత్తి నిలిపివేత
యూఎస్‌ అధిక టారిఫ్‌ల చర్యలు భారత్‌లోని తయారీ రంగాన్ని కుదుపునకు గురి చేస్తున్నాయి. పలు రంగాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ హబ్‌లుగా ఉన్న తిరుప్పూర్‌, సూరత్‌, నోయిడాలోని ఎగుమతి ఆధారిత టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ యూనిట్లలో వాటి యాజమాన్యాలు తయారీని నిలిపివేశాయి. అమెరికాలో భారత ఉత్పత్తులు పోటీపడే పరిస్థితి లేదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఐఈఓ) అభిప్రాయపడింది. భారతదేశ ఎగుమతుల అవకాశాలను ఇకపై వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి దేశాలు దక్కించుకోవచ్చని పేర్కొంది. భారత టెక్స్‌టైల్‌ ఎగుమతుల్లో మూడో వంతు ఒక్క అమెరికాకు వెళ్తున్నాయి. అధిక టారిఫ్‌లు దాదాపు రూ.72వేల కోట్ల విలువ చేసే ఎగుమతులను ప్రమాదంలో పడేశాయి. పోటీదారుల టారిఫ్‌లతో పోల్చితే 30-31 శాతం అంతరం ఉంది. ఉదాహరణకు తక్కువ సుంకాలు పడే బంగ్లాదేశ్‌ లేదా పాకిస్తాన్‌ వస్త్రాలు, తివాచీలనే కొంటారు. దీనివల్ల భారత ఎగుమతిదారులు నష్టపోతారు.

నాలుగు లక్షల ఉద్యోగాలపై ఎఫెక్ట్‌
వచ్చే ఆరు నెలల పాటు అమెరికా 50 శాతం టారిఫ్‌లు కొనసాగితే లక్షలాది ఉద్యోగాలు ఊడిపోవచ్చని వివిధ ఎజెన్సీలు అంచనా వేశాయి. ఒక్క టెక్స్‌టైల్‌ రంగంలోనే లక్ష నుంచి 1.50 లక్షల ఉద్యోగాలు పోవచ్చని విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే ఆయా కుటుంబాలపై పరోక్షంగా ఆధారపడిన ఇతర రంగాలు తీవ్ర ప్రభావితం కానున్నాయి. ఇతర రంగాలను కూడా కలిపితే దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఊడే అవకాశం ఉన్నట్టు అంచనా.

ప్రోత్సాహక చర్యలు తప్పవు
అమెరికా టారిఫ్‌ చర్యల నేపథ్యంలో ఎగుమతిదారులు భారత్‌ నుంచి ప్రోత్సాహకాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎక్స్‌పోర్ట్‌ రుణ మద్దతు, టర్మ్‌ లోన్‌ రీపేమెంట్‌పై ఒక సంవత్సర మారటోరియం, రుణ పరిమితులు 30 శాతం పెంచడం లాంటి మద్దతును ఇవ్వాలని కోరుతున్నారు. ఎంఎస్‌ఎంఇలకు సులభమైన రుణాలను అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రభుత్వ మద్దతు తప్పనిసరని తయారీదారులు చెప్తున్నారు. ఎగుమతిదారులను ఆదుకునేందుకు ‘ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ మిషన్‌’ అమలును వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం ఉంది. ఎగుమతిదారుల సమస్యలను ప్రభుత్వం గుర్తించిందనీ, వారికి అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటోందని వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. భారత్‌- అమెరికాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
దేశం యూఎస్‌ టారిఫ్‌ (శాతంలో)
మయన్మార్‌ 40
థాయిలాండ్‌ 19
కంబోడియా 19
బంగ్లాదేశ్‌ 20
ఇండోనేషియా 19
చైనా 30
శ్రీలంక 30
మలేషియా 19
ఫిలిప్పీన్స్‌ 19
వియత్నాం 20
పాకిస్తాన్‌ 19

రంగం ఉద్యోగ నష్టాలు..
టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ 1,50,000
రత్నాలు, అభరణాలు 1,00,000
తోలు, పాదరక్షలు 50,000
సముద్ర ఉత్పత్తులు 30,000
వాహన పరికరాలు 40,000
కెమికల్స్‌, సిరామిక్స్‌ తదితర 30,000
మొత్తం 4,00,000

భారత్‌కు మేల్కొలుపు కావాలి : రఘురాం రాజన్‌
భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు బాధాకరమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. ”ఏ ఒక్క వాణిజ్య భాగస్వామిపైనా ఎక్కువగా ఆధారపడకూడదు. భారత్‌కు ఇదో స్పష్టమైన మేల్కొలుపు. ట్రంప్‌ చర్యలు భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాలను దెబ్బతీశాయి. చైనా, యూరప్‌ వంటి రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై ట్రంప్‌ ఇలాంటి విధానాన్ని అనుసరించలేదు. ఇది యుఎస్‌ విదేశీ వాణిజ్య విధానంలో ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. అమెరికా భౌగోళిక రాజకీయం, వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్‌ అన్నిటినీ ఆయుధంగా మలుచుకుంటోంది.” అని రాజన్‌ ఆన్నారు. కచ్చితంగా ఇది ఆయా దేశాలపై వాణిజ్య యుద్ధమేనని ఆయన స్పష్టంచేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad