ఏటా రూ.54 వేల కోట్లు దానం
ఇది కార్పొరేట్ సీఎస్‌ఆర్ నిధులతో సమానం
మతపరమైన సంస్థలకే అధికం
నగదు, వస్తు రూపంలో సాయం : అధ్యయనం
న్యూఢిల్లీ: దాతృత్వంలో సరిలేరు మాకెవ్వరంటున్నారు భారతీయులు. ప్రపంచంలో తమకు మించిన దానగుణం ఉన్నవారు లేరని చాటి చెబుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు అందించే సీఎస్‌ఆర్ నిధులతో సమానంగా సామాన్య ప్రజలు దానం చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుతున్నారు. దేశంలో దానగుణానికి సంబంధించిన ఆసక్తికరమైన గణాంకాలను ఓ నివేదిక వెల్లడించింది. భారతీయులు చేసే వ్యక్తిగత విరాళాల్లో సింహభాగం మతపరమైన సంస్థలకు, యాచకులకు వెళుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు, దేశ దాతృత్వ శక్తి సామాన్య గృహాల్లోనే దాగి ఉందని చెప్పింది. అశోక యూనివర్సిటీకి చెందిన ‘సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంత్రోపీ’ ‘హౌ ఇండియా గివ్స్-2025’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది.
ప్రజల నుంచి ఏటా రూ.54 వేల కోట్ల విరాళాలు
దేశంలోని ప్రజలు ఏటా సుమారు రూ.54,000 కోట్ల ను విరాళాల రూపంలో ఇస్తున్నట్టు ఈ నివేదిక అంచనా వేసింది. ఇది కార్పొరేట్ సంస్థలు ఇచ్చే సీఎస్‌ఆర్ నిధులతో సమానంగా ఉండటం గమనార్హం. దేశంలో దానగుణం అనేది అన్ని వర్గాల్లో ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా దానం చేయడంలో సామాన్య ప్రజల చొరవ గణనీయంగా ఉందని స్పష్టం చేసింది.
సర్వేలోని కీలక అంశాలు
సర్వేలో పాల్గొన్న వారిలో 68శాతం మంది ఏదో ఒక రూపంలో విరాళాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఇందులో వస్తు రూపంలో (ఆహారం, బట్టలు) ఇచ్చేవారు 48శాతం ఉండగా, నగదు రూపంలో ఇచ్చేవారు 44శాతం, స్వచ్ఛంద సేవ చేసేవారు 30శాతం ఉన్నట్టు నివేదిక పేర్కొంది. మొత్తం విరాళాల్లో 45.9 శాతం దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి మతపరమైన సంస్థలకు వెళుతున్నట్టు వివరించింది. భారతీయుల ఆధ్యాత్మిక చింతన, నమ్మకాలు ఎంత బలంగా ఉన్నాయో ఈ విరాళాలు చాటిచెబుతున్నాయి.
ఎన్‌జీఓలకు అందేది దాదాపు 15 శాతమే!
సుమారు 41.8 శాతం విరాళాలు నేరుగా వ్యక్తులకు, ముఖ్యంగా యాచకులకు వెళుతున్నాయి. మతంతో సంబంధం లేని ఎన్‌జీఓలకు అందుతున్న విరాళాలు 14.9 శాతం మాత్రమే. వ్యవస్థీకృత మార్పు కంటే తక్షణ సాయం లేదా ఆధ్యాత్మిక సాయంపైనే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. విరాళాలు ఇవ్వడం, దానం చేయడంలో గ్రామీణ భారతం ఇందులో ముందుందని అధ్యయనం పేర్కొంది.
ప్రధాన కారణం ‘మతపరమైన బాధ్యత’
విరాళాలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగితే, ‘మతపరమైన బాధ్యత’ అని 90శాతం మంది సర్వేలో పాల్గొన్నవారు సమాధానం చెప్పారు. దైవచింతన, నైతిక బాధ్యతలే భారతీయుల దానగుణానికి ఇంధనంగా పనిచేస్తున్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. అలాగే, డిజిటల్ క్యాంపెయిన్ల కంటే నేరుగా వచ్చి అడిగే వారికే దానం, విరాళం అందించేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారని సర్వే గుర్తించింది.
దాతలు నాలుగు రకాలు
దాతలను ఈ నివేదిక నాలుగు రకాలుగా విభజించింది. ఒకటి గ్రాస్‌రూట్ దాతలు. వీరు స్థానిక సమస్యలపై మాత్రమే స్పందిస్తారు. రెండో రంకం ఆస్పిరేషనల్ దాతలు. వీరు సామాజిక హోదా లేదా మార్పు కోసం సాయం చేస్తారు. మూడో రకం ప్రాక్టికల్ దాతలు. వీరు ఆచరణాత్మకంగా ఆలోచించి సాయం చేస్తారు. నాలుగో రకం సంపన్న దాతలు. వీరు భారీ స్థాయిలో సమాజం కోసం నిధులు ఖర్చు చేస్తారు.
భారతదేశ అభివృద్ధికి పునాది
ఈ నివేదికను విడుదల చేసే సమయంలో అశోక యూనివర్సిటీకి చెందిన సీఎస్‌ఐపీ డైరెక్టర్ జిన్నీ ఉప్పల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ”హౌ ఇండియా గివ్స్ 2025-26 నివేదిక దేశంలో ఎప్పటి నుంచో పెద్దగా కొలవబడని దాతృత్వానికి దృశ్యరూపాన్ని ఇస్తుంది. వస్తు రూపంలో ఇచ్చే సహాయం, నగదు విరాళాలు, స్వచ్ఛంద సేవ వంటి దానధర్మాలు భారతదేశ అభివృద్ధికి పునాది లాంటివి. జాతీయ వినియోగ డేటా ఆధారంగా ఈ విశ్లేషణ చేయడం ద్వారా, భారతీయులు ఎలా విరాళాలు ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్నా కొద్దీ ప్రజల ధోరణి ఎలా మారుతుందో కూడా తెలుసుకోవచ్చు” అని వివరించారు.
ఆదాయం పెరుగుతున్నా కొద్దీ దానం!
దేశంలో దానం లేదా విరాళం ఇచ్చే వారికి సంపద మాత్రమే కొలమానం కాదని ఈ నివేదిక పేర్కొంది. నెలకు రూ.4,000-రూ.5,000 ఖర్చు చేసే అత్యంత సామాన్య కుటుంబాల్లో కూడా సగం మంది విరాళాలు ఇస్తున్నారని వెల్లడించింది. ఆదాయం పెరిగే కొద్దీ ఇది 70-80శాతానికి చేరినట్టు గుర్తించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో దానగుణం ఎక్కువగా ఉన్నట్టు సర్వే పేర్కొంది. అలాగే, పురుషులు పెద్దగా ఉండే కుటుంబాలు ఎక్కువగా మతపరమైన విరాళాలకు మొగ్గు చూపుతుండగా, మహిళలు నేతృత్వం వహించే కుటుంబాలు నిరుపేదలకు, వ్యక్తులకు నేరుగా సాయం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు అధ్యయనం గుర్తించింది.



