Sunday, January 25, 2026
E-PAPER
Homeబీజినెస్భారత మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్ల సెగ..

భారత మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్ల సెగ..

- Advertisement -

రూ.33,598 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
రూపాయి పతనం, వాణిజ్య అనిశ్చితి ఎఫెక్ట్‌
వారంలోనే రూ.16 లక్షల కోట్ల సంపద ఆవిరి..


ముంబయి : భారత స్టాక్‌ మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్లు సెగ పుట్టిస్తోన్నారు. వరుస విక్రయాలతో భారీగా పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఒక్క జనవరిలోనే ఇప్పటి వరకు విదేశీ పోర్టుపోలియో పెట్టుబడుదారులు (ఎఫ్‌పీఐ) ఏకంగా రూ.33,598 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఆగస్టు 2025 తర్వాత ఇదే గరిష్ట స్థాయి అమ్మకాలు కావడం గమనార్హం. ఈ భారీ అమ్మకాల ధాటికి గత వారంలో మార్కెట్లు కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.16 లక్షల కోట్లు ఆవిరయ్యింది. ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన బడ్జెట్‌ మరో వారం రోజుల్లో ఉన్నప్పటికీ.. మార్కెట్లలో ఎలాంటి సానుకూలాంశాలు కానరాకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన మరింత పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలోనూ భారత వృద్ధి రేటు అంచనాలను చేరకపోవచ్చనే విశ్లేషణలు దలాల్‌ స్ట్రీట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి.

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ అమాంతం పడిపోవడం ఇన్వెస్టర్లను ప్రధానంగా ఆందోళనకు గురి చేస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌టైం రికార్డు స్థాయిలో రూ.91.96కు పడిపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా వ్యవహారిస్తున్నారు. వరుసగా రూపాయి విలువ తగ్గడం వల్ల విదేశీ పెట్టుబడిదారులకు వచ్చే వాస్తవ లాభాలు తగ్గిపోతాయని, అందుకే వారు భారతీయ ఈక్విటీల నుండి విదేశీ సంస్థలు, విదేశీ వ్యక్తులు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి ఈ అమ్మకాలకు మరో ప్రధాన కారణం. అమెరికా-భారత్‌ మధ్య జరగాల్సిన వాణిజ్య ఒప్పందంలో జాప్యం. ఈ ఒప్పందంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.

ఒకవేళ ఈ ఒప్పందం మరింత ఆలస్యమైతే, అది భారతదేశ వాణిజ్య లోటుపై ప్రభావం చూపి, రూపాయిని మరింత బలహీనపరిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.2025-26 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండటమూ మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తోందని భావిస్తున్నారు. అనేక కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మార్కెట్‌ పతనానికి ఆజ్యం పోశాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వికె విజయకుమార్‌ తెలిపారు. ”మార్కెట్లోకి మళ్లీ విదేశీ పెట్టుబడులు రావాలంటే రెండు అంశాలు కీలకం. నాలుగో త్రైమాసికంలో కార్పొరేట్‌ కంపెనీల లాభాలు భారీగా మెరుగుపడాలి. అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన స్పష్టత రావాలి. ఈ రెండూ జరిగే వరకు మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవు.” అని విజయ్ కుమార్‌ అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -