Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓయూ ప్రొఫెసర్‌ సందీప్త బూర్గులకు భారత్‌ పేటెంట్‌

ఓయూ ప్రొఫెసర్‌ సందీప్త బూర్గులకు భారత్‌ పేటెంట్‌

- Advertisement -

రక్తపోటును తగ్గించే ప్రత్యేక పెప్టైడ్‌ అభివృద్ధి
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ

ఉస్మానియా విశ్వవిద్యాలయం కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌, సూక్ష్మ జీవశాస్త్ర (మైక్రో బయాలజీ) విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ సందీప్త బూర్గుల భారత్‌ పేటెంట్‌ సాధించారు. పరిశోధనలో భాగంగా రక్తపోటును తగ్గించే ప్రత్యేక పెప్టైడ్‌ను అభివృద్ధి చేశారు. ఈ మేరకు బుధవారం భారత్‌ పేటెంట్‌ వారు ఆమెకు ఆ పత్రాలు ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత మరణాలకు ప్రధాన కారణాల్లో హైపర్‌టెన్షన్‌ (రక్తపోటు) ముఖ్యమైనది కావడంతో, సహజ వనరుల ఆధారంగా సురక్షితమైన చికిత్సామార్గాలపై ఆమె పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో చేపల మాంసంలో ఉన్న ఎంజైమ్‌లను సేకరించి ప్రయోగశాలలో ప్రత్యేక పెప్టైడ్‌ను అభివృద్ధి చేసి పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశారు. ఈ మేరకు బుధవారం పేటెంట్‌ ప్రదానం చేశారు. ప్రొఫెసర్‌ సందీప్త పరిశోధన బృందంలో పీహెచ్‌డీ విద్యార్థిని ఉషారాణి కేశపాగ, డాక్టర్‌ గులాం హుస్సేన్‌, డాక్టర్‌ రఘు గొగడ సభ్యులుగా ఉన్నారు. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ పెప్టైడ్‌ రక్తపోటును గణనీయంగా తగ్గించినట్టు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాంటీ-హైపర్‌టెన్సివ్‌ మందుల వల్ల పలు దుష్ప్రభావాలు ఉండటంతో సహజ వనరుల నుంచి సురక్షితమైన ప్రత్యామ్నాయాల కోసం పరిశోధనలు అవసరమవుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన పెప్టైడ్‌ సాధారణంగా వాడే మందులతో సమానంగా ప్రభావం చూపినట్టు తెలిపారు.

ఈ ఆవిష్కరణ భవిష్యత్‌లో వైద్య రంగంలో ప్రీ-క్లినికల్‌ దశకు తీసుకెళ్లేందుకు తమ బృందం కృషి చేస్తుందని ప్రొఫెసర్‌ సందీప్త బూర్గుల తెలిపారు. ఆ పెప్టైడ్‌ పై లోతైన పరిశోధనలు జరపడానికి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నిధుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు చెప్పారు. ఇది ఒక ప్రయోగాత్మక పరిశోధన అన్నారు. ఈ పేటెంట్‌తో ఓయూ మరోసారి పరిశోధన రంగంలో తన ప్రతిభను చాటుకుంది. గత సంవత్సరం ప్రొఫెసర్‌ సందీప్త తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపకురాలిగా, మలేషియాలో మణిపాల్‌ యూనివర్సిటీ కాన్ఫరెన్స్‌లో విమెన్‌ ఇన్నోవేటర్‌ అవార్డులందుకున్నారు. పేటెంట్‌ పొందిన ప్రొఫెసర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -