Tuesday, March 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభయం గుప్పెట్లో భారతీయులు

భయం గుప్పెట్లో భారతీయులు

- Advertisement -

కోటి మందికి నిద్రలేని రాత్రులు
విమానాశ్రయాలలో పడిగాపులు

పశ్చిమాసియాలో నివసిస్తున్న సుమారు కోటి మంది భారతీయులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌-అమెరికా దాడులు, టెహ్రాన్‌ ప్రతి దాడులతో పశ్చిమాసియా ప్రాంతం దద్దరిల్లిపోతోంది. వేలాది విమాన సర్వీసులు రద్దు కావడంతో స్వదేశానికి చేరుకునే పరిస్థితి లేక భారతీయులు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. ఆకాశంలో దట్టంగా వ్యాపిస్తున్న పొగలు, మొబైల్‌ ఫోన్లలో వస్తున్న హెచ్చరికలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బాంబులు, క్షిపణులు, డ్రోన్ల దాడి నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు అవసరమైన షెల్టర్లు కూడా చాలినన్ని అందుబాటులో లేవు. కొందరి ప్రయాణాలైతే మధ్యలోనే ఆగిపోయాయి. వేలాది మంది గల్ఫ్‌ విమానాశ్రయాలలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అటు పోలేక, ఇటూ రాలేక విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్నారు.

గల్ఫ్‌లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. బహ్‌రైన్‌లో 3.27 లక్షలు, సౌదీ అరేబియాలో 24.63 లక్షలు, ఖతార్‌లో 8.36 లక్షలు, యూఏఈలో 35.68 లక్షలు, కువైట్‌లో 9.95 లక్షలు, ఒమన్‌లో 6.86 లక్షలు, ఇరాన్‌లో 10,765, ఇజ్రాయిల్‌లో 1.05 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ఎన్‌ఆర్‌ఐలు, భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. ‘దాడి చాలా ఉధృతంగా ఉంది. ఆకాశంలో డ్రోన్లు, క్షిపణులు కన్పిస్తున్నాయి. అనేక శకలాలు కూడా కింద పడుతున్నాయి. వాటి కారణంగా ఇక్కడ కొంత నష్టం జరుగుతోంది’ అని దుబాయ్ లో నివసిస్తున్న జలంధర్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఎస్‌పీ సింగ్‌ ఓబెరాయ్ చెప్పారు. ప్రపంచంలో నివసిస్తున్న భారతీయులలో ఎక్కువగా పశ్చిమాసియాలోనే ఉన్నారు. 2024లో ఒక్క గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ)లోని దేశాలలో నివసించిన భారతీయుల సంఖ్యే 90 లక్షలు.

వీరిలో ఎక్కువగా యూఏఈ, సౌదీ అరేబియాలలోనే నివసిస్తున్నారు. వీరు కాక ఇజ్రాయిల్‌లో లక్ష మంది, ఇరాన్‌లో పది వేల మందికిపైగా భారతీయులు ఉన్నారు. యూఏఈ జనాభాలో 35 శాతం మంది భారతీయులే. 2024లో అక్కడ 43 లక్షల మంది భారతీయులు ఉన్నారని అంచనా. అబూదాబీలో 15 శాతం మంది నివసిస్తుండగా మిగిలిన వారు దుబాయ్ సహా ఆరు ఎమిరేట్స్‌లో ఉంటున్నారు. యూఏఈలో కేరళీయుల సంఖ్య అధికం. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. యూపీ, బీహార్‌, పంజాబ్‌కు చెందిన వారు కూడా యూఏఈలో ఉపాధి పొందుతున్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో భారత్‌, ఇతర దేశాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు అబూ ధాబీ, దుబాయ్, షార్జా విమానాశ్రయాలలో చిక్కుబడి పోయారు. దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో ఇండ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని యూఏఈ అధికారులు ప్రజలను హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -