ప్రతి ఏటా రెండు లక్షలమంది ఐదేండ్లలో పదిలక్షల మంది
న్యూఢిల్లీ : గత ఐదేండ్ల కాలంలో సుమారు పది లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2022 నుంచి ఏటా రెండు లక్షల మందికి పైగా తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. అయితే భారతీయులు…ముఖ్యంగా సంపన్నులు, నిపుణులు పెద్ద సంఖ్యలో పాస్‌పోర్టులను వదిలేయాలని ఎందుకు నిర్ణయించుకుంటున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ సమాధానమిస్తూ 2024లో 2.06 లక్షల మంది పౌరసత్వాన్ని వదిలేశారని తెలిపింది.
2022లో 2.25 లక్షల మంది, 2023లో 2.16 లక్షల మంది పౌరసత్వాన్ని వదిలేశారు. కోవిడ్ కారణంగా 2020లో అతి తక్కువగా 85,256 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. మొత్తం మీద 2011-2024 మధ్యకాలంలో 20.6 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదిలేశారు. వ్యక్తిగత కారణాలతోనే భారతీయులు పౌరసత్వాన్ని వదులుకుంటున్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. కాగా ద్వంద్వ పౌరసత్వం లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. చట్ట ప్రకారం విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా పొందిన భారతీయులు దేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. అదీకాక కోవిడ్ తర్వాత పౌరసత్వాలను వదులుకోవడం పెరిగింది. భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలలో స్థిరపడుతూ ఉద్యోగాలు చేయడం కూడా ఒక కారణంగా కన్పిస్తోంది.
పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయులు
- Advertisement -
- Advertisement -



