- Advertisement -
- అక్టోబర్ నుంచి అమల్లోకి..
న్యూఢిల్లీ : యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ)తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ ఒక్కటో తేది నుంచి అమల్లోకి రానుందని స్విట్జర్లాండ్ బుధవారం ప్రకటించింది. ఇది భాగస్వామ్యం దేశాల సమాగ్రాభివృద్ధికి దోహదం చేయడంతో పాటుగా చట్టబద్ధమైన నిబంధనలను కలిగి ఉందని పేర్కొంది. ఈఎఫ్‌టీఏ బ్లాక్‌లో ఐస్‌లాండ్, లీచ్టెన్‌స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాలున్నాయి. 2024 మార్చిలో ఇరు పక్షాలు ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లో వచ్చే 15 సంవత్సరాలలో ఈఎఫ్‌టీఏ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మొదటి 10 సంవత్సరాలలో 50 బిలియన్ డాలర్లు, తదుపరి 5 సంవత్సరాలలో మరో 50 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా రానున్నాయి. ఈ పెట్టుబడితో భారత్‌లో 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. ఈ తరహా నిబంధన భారతదేశ వాణిజ్య ఒప్పందాలలో తొలిసారి చోటు చేసుకుంది. దీనికి బదులుగా భారతదేశం స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ తదితర ఇఎఫ్‌టిఎ ఎగుమతులపై సుంకాలను తగ్గించడం లేదా తొలగించడానికి అంగీకరించింది. ”ఇది స్విస్ వస్తువులు, సేవలకు భారతీయ మార్కెట్‌కు మెరుగైన ప్రవేశాన్ని అందిస్తుంది. మా ఉత్పత్తులకు భారత్ మెరుగైన మార్కెట్ అవకాశాలను కలిపిస్తుంది. తమ ఎగుమతులలో ఔషధ ఉత్పత్తులు, యంత్రాలు, ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాచీలు, ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి.” అని స్విట్జర్లాండ్ తెలిపింది. ”ఈ ఒప్పందంతో సంబంధం ఉన్న భాగస్వామ్య దేశాల పర్యావరణ, కార్మిక చట్టాలు లేదా అంతర్జాతీయ పర్యావరణ, సామాజిక చట్టాలు ఉల్లంఘించకుండా చూస్తుంది.” అని స్విట్జర్లాండ్ తెలిపింది.
- Advertisement -