నవతెలంగాణ-హైదరాబాద్: ది ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. దీనితో ఈ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. మొత్తంగా చివిరి టెస్టులో ఉత్కంఠభరితంగా సాగి చివరకు 6 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్ ను సమం చేసింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులు చేయగలిగింది. కరుణ్ నాయర్ (57) మినహా మిగిలిన బ్యాటర్లు సరైనగా నిలదొక్కుకోలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బతీశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 247 పరుగులు చేసి 23 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు చెరో 4 వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయకుండా ఆదుకున్నారు.
ఇక భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (118) ధాటిగా ఆడి శతకాన్ని నమోదు చేశాడు. అలాగే అకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) లు కీలక పాత్ర పోషించారు. దీంతో భారత్ 396 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111)లు శతకాలతో పోరాడారు. కానీ చివర్లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను 367 పరుగులకే ఆలౌట్ చేశారు. దీనితో చివరికి కేవలం 6 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.