చైనా జీడీపీ పెరగొచ్చు
ప్రపంచ బ్యాంక్ అంచనా
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలు భారత వృద్ధిని దెబ్బతీయొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అధిక టారిఫ్‌లతో భారత ఎగుమతులు తగ్గొచ్చని.. దీంతో వచ్చే ఏడాది దక్షిణాసియా వృద్ధి రేటు మందగించవచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జీడీపీ 6.5 శాతంగా ఉండొచ్చని.. వచ్చే ఏడాది 2026-27లో 6.3 శాతానికి తగ్గొచ్చని విశ్లేషించింది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించడంతో 50 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులపై ప్రభావం పడనుందని గుర్తు చేసింది. 2025-26లో దక్షిణాసియా వృద్ధి 6.6 శాతంగా ఉండొచ్చని.. తదుపరి 2026-27లో 5.8 శాతానికి తగ్గొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. బలహీన ఎగుమతులతో భారత్, మాల్దీవులు, నేపాల్ విదేశీ మారకం ఒత్తిడికి గురి కావొచ్చని తెలిపింది.
ఇదే సమయంలో చైనా జీడీపీ మాత్రం పెరగొచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ప్రస్తుత 2025-26లో చైనా జీడీపీ 4 శాతంగా ఉండొచ్చని ఏప్రిల్‌లో వేసిన అంచనాలను ఏకంగా 4.8 శాతానికి పెంచింది. అమెరికా టారిఫ్‌ల పెంపు ఉన్నప్పటికీ చైనాలో దేశీయ డిమాండ్ పెరగడమే ప్రధాన కారణమని పేర్కొంది. సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం వినియోగ వస్తువులు, ఆటోమొబైల్స్‌పై పన్ను తగ్గింపులను ప్రకటించినప్పటికీ, అలాగే మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచుతోన్నట్లు ప్రకటించినప్పటికీ ప్రపంచ బ్యాంక్ భారత జీడీపీ అంచనాలకు కోత పెట్టడం విశేషం. కరోనా తర్వాత రికవరీ ఊపు తగ్గడం, కొత్త వాణిజ్య అడ్డంకులతో దక్షిణాసియా వృద్ధి మందగిస్తుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.
అధిక సుంకాలతో భారత్ వృద్ధి తగ్గొచ్చు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES