Tuesday, April 7, 2026
E-PAPER
Homeబీజినెస్భారత వృద్ధి అంచనాలకు కోత

భారత వృద్ధి అంచనాలకు కోత

- Advertisement -

6.9 శాతం దిగువనే ఉండొచ్చు
ఐసీఐసీఐ బ్యాంక్‌ రిపోర్ట్‌
ముంబయి :
ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన వనరుల సరఫరాలో ఏర్పడిన ఆటంకాలతో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి తగ్గొచ్చని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత జీడీపీని గతంలో అంచనా వేసిన 7.2 శాతం నుంచి 6.8-6.9 శాతానికి తగ్గిస్తున్నట్టు పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసులో తలెత్తిన అవరోధాలు దేశీయ ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి అవసరమైన ఇంధన సరఫరాపై ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ”పారిశ్రామిక ఇంధన సరఫరాపై ఆంక్షలు ఉన్నందున, గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల ఎరువులు, సిరామిక్స్‌, లోహాలు, గాజు వంటి రంగాల ఉత్పత్తి ప్రభావితమయ్యే అవకాశం ఉంది” అని ఐసీఐసీఐ బ్యాంక్‌ నివేదిక స్పష్టం చేసింది. గతంలో 2022లో ఇంధన ధరలు పెరిగినప్పుడు తయారీ రంగం ఏ విధంగా మందగించిందో గుర్తు చేసింది. ప్రస్తుతం మార్చి నెల తయారీ పీఎంఐ 53.9కి పడిపోవడం తక్షణ ప్రభావానికి నిదర్శనమని పేర్కొంది.విదేశీ వాణిజ్యం, చమురు ధరల ప్రభావంపై ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల వద్ద కొనసాగడం వృద్ధికి ప్రతికూలమని తెలిపింది. చమురు ధరలు 111 డాలర్ల వద్ద ఉన్నప్పుడు (2012-14) వాస్తవ జీడీపీ 5.7 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం సరఫరా పరిమితులు హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనం వల్ల ఎగుమతులు దెబ్బతినడం వంటి అంశాలు 2025-26లోని నాలుగో త్రైమాసికం, 2026-27లో మొదటి త్రైమాసికంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ తన నివేదికలో వెల్లడించింది. ఎగుమతుల్లో 15 శాతం వాటా ఉన్న గల్ఫ్‌ దేశాలకు రవాణా నిలిచిపోవడం కూడా ఈ వృద్ధి కోతకు మరో ప్రధాన కారణమని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -