4 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్
నవతెలంగాణ-ఇండోర్ : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు హ్యాట్రిక్ పరాజయం మూటగట్టుకుంది. టైటిల్ ఫేవరేట్‌గా వరల్డ్‌కప్ వేటను మొదలెట్టిన హర్మన్‌ప్రీత్ సేన.. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆదివారం ఇండోర్‌లో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 289 పరుగుల భారీ ఛేదనలో స్మతీ మంధాన (88, 94 బంతుల్లో 8 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (70, 70 బంతుల్లో 10 ఫోర్లు), దీప్తి శర్మ (50, 57 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్ చేజేతులా ఓటమి చెందింది.
ఆల్‌రౌండర్లు ఆమన్జోత్ కౌర్ (18 నాటౌట్), స్నేV్‌ా రానా (10 నాటౌట్) క్రీజులో నిలిచినా ఆఖరు 12 బంతుల్లో 23 పరుగులు చేయటంలో విఫలమయ్యారు. 50 ఓవర్లలో 6 వికెట్లకు భారత్ 284 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ (109, 91 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించగా, ఆమీ జోన్స్ (56 68 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీ చేసింది. భారత స్పిన్నర్ దీప్తి శర్మ (4/51) నాలుగు వికెట్ల ప్రదర్శన చేసింది. గ్రూప్ దశలో నాల్గో విజయంతో ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకోగా.. భారత్ చివరి రెండు మ్యాచుల్లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.