Monday, September 29, 2025
E-PAPER
Homeఆటలుఆసియాపై భారత్‌ తిలకం

ఆసియాపై భారత్‌ తిలకం

- Advertisement -

– పాకిస్తాన్‌ 146/10, భారత్‌ 150/5
– ఛేదనలో తిలక్‌ వర్మ వీరోచిత ఇన్నింగ్స్‌
– ఫైనల్లో పాకిస్తాన్‌పై ఘన విజయం
– రికార్డు 9వ ఆసియా టైటిల్‌ వశం


అభిషేక్‌ శర్మ (5) ఆరంభంలోనే అవుటయ్యాడు. శుభ్‌మన్‌ గిల్‌ (12) మళ్లీ నిరాశపరిచాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (1) చేతులెత్తేశాడు. ఛేదనలో 20/3తో పీకల్లోతు ఒత్తిడిలో భారత్‌. గెలుపు గమనాన్ని నిర్దేశించే పవర్‌ప్లేలో పాకిస్తాన్‌ పైచేయి. టైటిల్‌ చేజారిందా? అనే అందోళన మొదలైన క్షణాలు..
కఠిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం తిలక్‌ వర్మ (69 నాటౌట్‌) వీరోచిత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. సంజు శాంసన్‌ (24), శివం దూబె (33) జతగా విలువైన భాగస్వామ్యాలు నిర్మించిన తిలక్‌..భారత్‌ను గెలుపు బాటలో నడిపించాడు. తిలక్‌ వర్మ క్లాస్‌, మాస్‌ మేళవింపుతో కూడిన ఇన్నింగ్స్‌కు నెమ్మదిగా ఒత్తిడిలో చిత్తయిన పాకిస్తాన్‌ ఆసియా కప్‌లో ముచ్చటగా మూడోసారి భారత్‌ చేతిలో భంగపాటుకు గురైంది. తిలక్‌ దిద్దిన విజయంతో భారత్‌ రికార్డు తొమ్మిదోసారి ఆసియా కప్‌ విజేతగా అవతరించింది.


నవతెలంగాణ-దుబాయ్‌

తెలుగు తేజం తిలక్‌ వర్మ (69 నాటౌట్‌, 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చితక్కొట్టాడు. ఉత్కంఠభరిత టైటిల్‌ పోరులో మిస్టర్‌ కూల్‌ ఇన్నింగ్స్‌ ఆడిన తిలక్‌ వర్మ అజేయ అర్థ సెంచరీతో భారత్‌కు అద్వితీయ విజయాన్ని అందించాడు. తిలక్‌ వర్మకుతోడు శివం దూబె (33, 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజు శాంసన్‌ (24, 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో ఆదివారం దుబారులో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌పై భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించిన భారత్‌.. రికార్డు 9వ ఆసియా కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలుత పాకిస్తాన్‌ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (4/30), అక్షర్‌ పటేల్‌ (2/26), వరుణ్‌ చక్రవర్తి (2/30), పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/25) సమిష్టిగా రాణించారు. పాక్‌ ఓపెనర్లు ఫర్హాన్‌ (57, 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫకర్‌ జమాన్‌ (46, 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిసినా.. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ స్పిన్‌ మాయకు కుప్పకూలింది. ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ తొలిసారి తలపడగా.. టీమ్‌ ఇండియా అలవోక విజయం అందుకుంది.

తిలక్‌ వర్మ షో
147 పరుగుల ఛేదనలో భారత్‌ దారుణంగా తడబడింది. ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ (5) సహా శుభ్‌మన్‌ గిల్‌ (12), సూర్యకుమార్‌ యాదవ్‌ (1) తొలి నాలుగు ఓవర్లకే డగౌట్‌కు చేరారు. పాక్‌ పేసర్లు ఉత్సాహంలో విజృభిస్తున్న వేళ క్రీజులోకి వచ్చిన తిలక్‌ వర్మ (69 నాటౌట్‌) అసమాన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒత్తిడిలో ఎంతో సంయమనంతో ఆడిన తిలక్‌ ఆఖరు ఐదు ఓవర్లలో జూలు విదిల్చాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన తిలక్‌ 41 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. తొలుత సంజు శాంసన్‌ (24)తో కలిసి నాల్గో వికెట్‌కు 50 బంతుల్లో 57 పరుగులు జోడించాడు. శివం దూబె (33)తో కలిసి ఐదో వికెట్‌కు 40 బంతుల్లోనే 60 పరుగులు పిండుకున్నాడు. దూబె సైతం రెండేసి సిక్సర్లు, ఫోర్లతో మెరువగా.. పాక్‌ బౌలర్లు ఒత్తిడిలో కూరుకున్నారు. ఆఖర్లో దూబె అవుటైనా.. రింకు సింగ్‌ (4 నాటౌట్‌) విన్నింగ్‌ షాట్‌తో లాంఛనం ముగించాడు. పాక్‌ బౌలర్లలో ఫహీమ్‌ అష్రాఫ్‌ (3/29) మూడు వికెట్లు పడగొట్టాడు.

స్పిన్‌ మాయాజాలం
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు ఫర్హాన్‌ (57), ఫకర్‌ జమాన్‌ (46) అదిరే ఆరంభం అందించారు. ఫర్మాన్‌ భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. మరో ఎండ్‌లో ఫకర్‌ జమాన్‌ చక్కటి సహకారం అందించాడు. ఫర్హాన్‌ దండెత్తటంతో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ తొలి రెండు ఓవర్లలోనే 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఫర్హాన్‌ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 బంతుల్లో అర్థ సెంచరీ బాదాడు. ఫర్హాన్‌ జోరుతో పాకిస్తాన్‌ భారీ స్కోరు దిశగా సాగింది. పవర్‌ప్లేలో వికెట్‌ పడలేదు, దీంతో భారత బౌలర్లు ఒత్తిడిలో పడ్డారు. ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి మాయకు ఫర్హాన్‌ నిష్క్రమించాడు. దీంతో భారత్‌ కాస్త తేరుకుంది.

మాయ చేశారు
పాకిస్తాన్‌ ఓ దశలో 113/1తో పటిష్టంగా నిలిచింది. 200 పరుగులపై కన్నేసిన పాక్‌ను బౌలర్లు సమిష్టిగా కొట్టారు. దీంతో పాక్‌ చివరి 9 వికెట్లను 33 పరుగులకే కోల్పోయింది. తొలుత తడబడిన కుల్‌దీప్‌.. తన ఆఖరు ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్‌ ఓవర్లో భారీ సిక్సర్‌ బాదిన ఫకర్‌ జమాన్‌.. తర్వాతి బంతికి వికెట్‌ కోల్పోయాడు. ఇక్కడ్నుంచి నిలకడగా వికెట్లు పడగొట్టిన భారత్‌.. మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకుంది. టాప్‌-3 బ్యాటర్లు ఫర్హాన్‌, ఫకర్‌, ఆయుబ్‌ (14) మినహా ఆ జట్టులో మరో బ్యాటర్‌ రాణించలేదు. హరీశ్‌ (0), సల్మాన్‌ (8), హుస్సేన్‌ (1), నవాజ్‌ (6), షహీన్‌ షా (0), ఫహీమ్‌ (0), రవూఫ్‌ (6)లు తేలిపోయారు. 19.1 ఓవర్లలో 146 పరుగులకు పాకిస్తాన్‌ కథ ముగిసింది. భారత బౌలర్లలో బుమ్రా (2/25), వరుణ్‌ (2/30), అక్షర్‌ (2/26), కుల్‌దీప్‌ (4/30) రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -