Monday, February 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌ విజయవంతంగా వికసిస్తున్న ఆర్థిక వ్యవస్థ

భారత్‌ విజయవంతంగా వికసిస్తున్న ఆర్థిక వ్యవస్థ

- Advertisement -

ఏఐ సదస్సుకు అదే సరైన చోటు : ఐరాస చీఫ్‌

జెనీవా: భారత్‌ చాలా విజయవంతంగా వికసిస్తున్న ఆర్థిక వ్యవస్థ అని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ అభివర్ణించారు. అంతర్జాతీయ వ్యవహారాలపై పెద్ద ప్రభావాన్ని చూపగల సత్తా భారత ఆర్థిక వ్యవస్థకు ఉందన్నారు. ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు- 2026 లాంటి అంతర్జాతీయ స్థాయి కీలక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారతే సరైన చోటు అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనియో గుటెరెస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు- 2026 జరగబోతోందనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ కామెంట్స్‌ చేశారు.

రెండు సూపర్‌ పవర్‌లకు పరిమితం కాకూడదు
‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలీజెన్స్‌ (ఏఐ) అనేది యావత్‌ ప్రపంచానికి ప్రయోజనాన్ని చేకూర్చాలి. కేవలం అభివృద్ధి చెందిన దేశాలకో, రెండు సూపర్‌ పవర్‌లకో(అమెరికా, చైనా) అది పరిమితం కాకూడదు. ఏఐ ఎవరో కొందరి సొత్తు కాదు. అది యావత్‌ ప్రపంచానిది. ప్రపంచంలో ప్రతీచోటా, ప్రతీ ఒక్కరికీ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడాలి. ఏఐ అనేది మానవాళి శ్రేయస్సు కోసం దోహదపడే సార్వత్రిక ఉపకరణంగా మారాలి. గ్లోబల్‌ సౌత్‌ పరిధిలోని దేశాలకూ ఏఐ ఫలాలు లభించాలి. ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు భారత్‌కు నా అభినందనలు. ఇందులో పాల్గొనేందుకు నేను కూడా ఢిల్లీకి వెళ్తున్నాను. భారత్‌లో జరగనున్న సదస్సులో ఏఐ వినియోగంపై కూలంకషమైన చర్చలు జరుగుతాయి. ఏఐను వినియోగించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ముప్పులపైనా డిస్కషన్‌ జరుగుతుంది’ అని ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరెస్‌ తెలిపారు.

ఆ అంశంపై ప్రధాని మోదీతో చర్చిస్తా
‘పారదర్శకంగా అన్ని దేశాలకు సమ ప్రాధాన్యత లభించాలంటే ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అభివద్ధిచెందుతున్న దేశాలకు బలంగా వాణిని వినిపించే అవకాశం లభించాలి. ప్రపంచంలో అభివృద్ధిచెందుతున్న దేశాలకు కేంద్ర బిందువుగా భారత్‌ కనిపిస్తోంది. ఈ అంశంపై నేను భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చిస్తాను. బహుళ ధ్రువ ప్రపంచం సాకారంలో భారత్‌ కీలక పాత్రను పోషిస్తుందనే ఆశాభావంలో నేను ఉన్నాను. భారత్‌కు వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. భారీ వైవిధ్యం, అద్భుత నాగరికత, సంస్కృతిలకు భారత్‌ నెలవు. గత కొన్ని శతాబ్దాల్లో ప్రపంచ వికాసంలో భారత్‌ పోషించిన పాత్రపై ప్రస్తుతం నేను కొన్ని పుస్తకాలు, నివేదికలను చదువుతున్నాను. క్రీస్తు పూర్వమే చైనా, ఆగేయ ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలపైనా భారత నాగరికత, సంస్కృతిల ప్రభావం పడింది. రోమన్‌ సామ్రాజ్య కాలంలోనూ మధ్యధరా సముద్ర ప్రాంత దేశాలతో భారత్‌కు బలమైన వాణిజ్య అనుబంధం ఉండేది’ అని ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరెస్‌ తెలిపారు.

నేను బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను
‘ఈ ప్రపంచంలో రెండు అంశాలు జరగకుండా మనం అడ్డుకోవాలి. యావత్‌ ప్రపంచ వ్యవహారాలపై పెత్తనం ఒకే దేశం చేతిలో అస్సలు ఉండకూడదు. యావత్‌ ప్రపంచం రెండు సూపర్‌ పవర్‌ల మధ్య విభజితమై కూడా ఉండకూడదు. బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలంగా కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడాలంటే అభివద్ధిచెందుతున్న దేశాలకు వాణిజ్యం, టెక్నాలజీ, అంతర్జాతీయ సంబంధాలలో చాలాచాలా కీలకమైన పాత్రలను పోషించే అవకాశాలు లభించాలి. ఇటీవలే భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందమే అందుకు మంచి ఉదాహరణ. భారత్‌ వికాసాన్ని యావత్‌ ప్రపంచం గుర్తిస్తోంది. ప్రపంచంలోని అభివద్ధి చెందిన దేశాలు, అభివద్ధి చెందుతున్న దేశాలు ప్రత్యేక సమూహాలుగా ఏర్పడుతున్నాయి. ఈ సమూహాల వల్లే నిజమైన బహుళ ధ్రువ ప్రపంచం దిశగా బాటలు పడుతున్నాయి. దీనివల్ల ఏదో ఒక దేశం పెత్తనానికి అవకాశం లేకుండా పోతోంది’ అని ఐరాస చీఫ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -