Tuesday, January 27, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్డిఫాల్ట్‌ మిల్లర్లపై ఉదాసీనత

డిఫాల్ట్‌ మిల్లర్లపై ఉదాసీనత

- Advertisement -

ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
సివిల్‌ సప్లరు అధికారుల తీరుతో
సుమారు రూ.72 కోట్ల నష్టం
‘సీఎంఆర్‌’ ఇవ్వకున్నా ధాన్యం కేటాయింపులు
మూడురోజుల క్రితం కామారెడ్డి కార్యాలయంలో ఏసీబీ రైడ్‌
‘అనుమానాస్పద’ లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు
అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) చెల్లించడంలో విఫలమై డిఫాల్ట్‌ రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోకపోగా.. తిరిగి వారికే మళ్లీ మళ్లీ ధాన్యం కేటాయింపులు ఇవ్వడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడింది. అనుమానాస్పద లావాదేవీలు చోటుచేసుకోవడంతో సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ అధికారులు మిల్లులపై చర్యలు తీసుకోకుండా మరోసారి ధాన్యం కేటాయింపులు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ కార్యాలయంలో శనివారం, ఆదివారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా అనేక లోపాలు వెలుగుజూసినట్టు ఏసీబీ అధికారులు ప్రతికా ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం..

2021-22 ఖరీఫ్‌ సీజన్‌లో 39 మిల్లుల యజమానులు డిఫాల్ట్‌ అయితే కేవలం రెండు రైస్‌ మిల్లుల యజమానులపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు గుర్తించారు. సుమారు 581 మెట్రిక్‌ టన్నులు సీఎంఆర్‌ రావాల్సి ఉంది. వాటి విలువ దాదాపు రూ.64 లక్షలున్నట్టు గుర్తించారు. అదే విధంగా 2022-23 ఖరీఫ్‌ సీజన్‌లో 37 మిల్లుల యజమానులు డిఫాల్ట్‌ అవ్వగా అప్పుడు కూడా రెండు రైస్‌ మిల్లుల యజమానులపై చర్యలు తీసుకున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి రూ.41 కోట్ల విలువైన 19,529 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రావాల్సి ఉంది. 2023-24లో ఖరీఫ్‌ సీజన్‌లో 7 మిల్లుల యజమానులు డిఫాల్ట్‌ కాగా ముగ్గురిపై చర్యలు తీసుకోగా.. 5,194 మెట్రిక్‌ ధాన్యం రావాల్సి ఉందని దాని విలువ రూ.2.5 కోట్లు. 2023-24లో గ్రీన్‌ హిల్స్‌ ఆగ్రో ఇండిస్టీస్‌ కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం విషయంలో డిఫాల్ట్‌ కావడంతో క్రిమినల్‌ కేసు నమోదైంది. అయినప్పటికీ, అధికారులు 2024-25 ఖరీఫ్‌ రబీ పంటను అదే మిల్లు యజమానికి కేటాయించినట్టు గుర్తించారు.

తనిఖీలు చేపట్టని అధికారులు
గతేడాది సెప్టెంబర్‌ నుంచి జిల్లా పౌర సరఫరాల అధికారి, సంస్థ జిల్లా మేనేజర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను, రైస్‌మిల్లులను తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు. దాంతో పాటు కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఇకరు అనుమానాస్పద లావాదేవీల్లో పాలుపం చుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై లోతైన విచారణ చేపడుతున్నారు. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ రావడంలో భారీ కొరత ఉన్నప్పటికీ.. పౌరసరఫరాల శాఖ అధికారి, జిల్లా మేనేజర్‌, డిప్యూటీ తహసీల్దార్‌లు చర్యలు తీసు కోవడంలో విఫలం కావడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, సంబంధిత అధికారులపై చర్యలు తీసు కోవాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదించారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న అధికారులు ఇటీవల బాధ్యతలు చేపట్టగా.. గతంలో పని చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా.. అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.

రైతులకు సకాలంలో ఎంఎస్‌పీ చెల్లింపుల్లో కామారెడ్డి టాప్‌
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణలో ఐదు విభాగాల్లో జరిగిన కృషిపై సివిల్‌ సప్లరు కమిషనర్‌ సమీక్షించగా.. రాష్ట్రంలో రైతులకు సకాలంలో మద్దతు ధర డబ్బులు చెల్లించడంలో కామారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం సేకరించిన మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించడంతో సివిల్‌ సప్లరు అధికారి వెంకటేశ్వర్లు, కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌ ఈ నెల 23వ తేదీన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్‌ స్టీఫెన్‌ రవీందర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. తర్వాత రోజే కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరగడం కొసమెరుపు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -