850కి పైగా విమానాల రద్దు
మిగిలినవీ ఆలస్యమే..
ప్రయాణికుల పడిగాపులు…అసహనం
సేవల్లో విఫలమయ్యామన్న సీఈవో, క్షమాపణలు
విమాన చార్జీలపై ఎట్టకేలకు కేంద్రం నియంత్రణ
నేటి రాత్రికల్లా రీఫండ్‌లు ఇచ్చేయాలని ఆదేశాలు
ప్రత్యేక రైళ్ళను నడుపుతున్న రైల్వే
న్యూఢిల్లీ : వరుసగా ఐదో రోజూ దేశీయ విమాన సేవల్లో సంక్షోభం కొనసాగింది. శనివారం కూడా వందలాది ఇండిగో విమానాలు రద్దు కావడంతో పాటు ఇతర విమానాలూ తీవ్ర ఆలస్యంగా నడిచాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు పడడంతో పాటూ తీవ్ర ఇబ్బందులూ ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహావేశాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా వెయ్యి పైగా విమానాలు రద్దు అయినట్టు సంకేతాలు ఉన్నా, అధికారికంగా 850కి పైగా విమానాలు నిలిచిపోయినట్టు ఇండిగో వెల్లడించింది. మరోపక్క త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. జరిగిన అసౌకర్యానికి చింతిస్తూ ఆ సంస్థ సీఈవో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
అలాగే విమానాలు నడవక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే, వెస్ట్రన్ రైల్వేలు ప్రత్యేక రైళ్ళను నడపాలని నిర్ణయించాయి. కొన్ని ప్రధానమైన రైళ్ళకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు రైల్వే ఒక ప్రకటన చేసింది. శనివారం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో 69, బెంగళూరులో 124, ఢిల్లీలో 106, ముంబయిలో 117, కోల్‌కతాలో 41, అహ్మదాబాద్‌లో 35 విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని రిపోర్టులు వస్తోన్నాయి. దీంతో వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విమానాల ఆలస్యం, రద్దునకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహంతో డీజీసీఏకు ఫిర్యాదులు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇండిగో సీఈవో క్షమాపణలు
బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌గా గుర్తింపు పొందిన ఇండిగో శుక్రవారం వెయ్యికి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. గత నాలుగు రోజులుగా ఇంత గందరగోళం నెలకొన్నా నోరు విప్పని ఇండిగో సీఈఓ పీటర్ అల్బర్స్ ప్రయాణికులకు కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. జరిగినదానిపై వివరణ ఇస్తూ ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యామని అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను, షెడ్యూళ్లను తిరిగి పునరుద్ధరించే పనిలో ఉన్నామన్నారు. విమానాల రద్దు, ఆలస్యం, అంతరాయాలపై క్షమాపణలు కోరుతూ వచ్చే పది రోజుల్లో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని హామీ ఇచ్చారు. అయితే ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగవచ్చని వైమానిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేటి రాత్రికల్లా రీఫండ్‌లు ఇవ్వాలి :ప్రభుత్వం
ఆదివారం రాత్రి 8గంటల కల్లా ప్రయాణికులకు రీఫండ్‌లు ఇవ్వడం పూర్తి చేయాలని ఇండిగో యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తమ వినియోగదారులకు వేగంగా రీఫండ్‌లు అందించడంపై దృష్టి సారించినట్టు ఇండిగో తెలిపింది. ప్రయాణికులకు ఫ్లైట్ షెడ్యూల్ వివరాలను వెబ్‌సైట్లు, మొబైల్ నోటిఫికేషన్ల ద్వారా కూడా అందిస్తున్నట్టు వెల్లడించింది.
ప్రయాణికుల జేబులకు చిల్లులు.. స్పందించిన కేంద్రం
ఇండిగోలో నెలకొన్న సంక్షోభంతో వందలాది విమానాలు రద్దు అవుతున్న పరిస్థితులను ఆసరాగా తీసుకుని కొన్ని విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ల ధరలను పెంచాయి. ఇప్పటికే లక్షలాది మంది ప్రయాణికులు తమ అత్యవసర ప్రయాణాల కోసం రెండు, మూడు రెట్లు అధికంగా చెల్లించి ముందస్తు, తక్షణ ప్రయాణాల కోసం టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈ అధిక విమాన చార్జీలపై విమానాశ్రయాలు సహా సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళనలు నెలకొనడంతో ఎట్టకేలకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. విమాన టికెట్ ధరలపై నియంత్రణ విధిస్తున్నట్లు తెలిపింది.
500 కిలోమీటర్ల వరకు గరిష్టంగా రూ.7,500, 500-1000 కిలోమీటర్ల వరకు రూ.12,000, 1000-1500కిలోమీటర్ల వరకు రూ.15,000, 1500 కిలోమీటర్లు దాటితే రూ.18,000 వరకు మాత్రమే టికెట్ చార్జీలను వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.అంతరాయాల సమయంలో అసాధారణంగా చార్జీలను పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకునేవరకు కొత్తగా సూచించిన పరిమితులను కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది. రీజనల్ మార్గాల్లో రాయితీతో నడిచే ఉడాన్ విమానాలు ఆర్‌సిఎస్-యుడిఎస్ విమానాలకు, బిజినెస్ క్లాస్‌కు ఈ చార్జీలు వర్తించవని వెల్లడించింది.
టికెట్ ధరలపై పర్యవేక్షణ
టికెట్ ధరలను పెంచకుండా పర్యవేక్షిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్‌లైన్స్, ట్రావెల్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణకు ఆదేశించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు జరిగినదానిపై ఇండిగో కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించామన్నారు. రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందన్నారు. గత కొన్ని రోజులుగా ఇండిగో విమానాలతో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఫిబ్రవరి 10 వరకు కొత్త నిబంధనల అమలు నుండి ఇండిగోను మినహాయిస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
48గంటల్లోగా సామాను అప్పగించండి
విమానాల రద్దు లేదా జాప్యం కారణంగా ప్రయాణికుల నుంచి వేరుపడిన వారి బ్యాగేజీ ఎక్కడుందో కనుగొని, వచ్చే 48గంటల్లోగా వారికి అందజేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ శనివారం ఇండిగోని ఆదేశించింది.
ఇండిగో సీఈవోపై వేటు ?
ఇండిగో సేవల్లో నెలకొన్న అంతరాయం, సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థ సీఈవో పీటర్ అల్బర్స్‌ను పదవి నుంచి తొలగించాలని కేంద్రం, ఇండిగో బోర్డుకు ఆదేశాలు జారీ చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ సంస్థకు భారీగా జరిమానా కూడా విధించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం బాధ్యత వహించాలి : సీపీఐ
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఒక కంపెనీ ఎయిర్‌లైన్స్ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తే ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో తెలుస్తోందని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు. దేశంలో నెలకొన్న ఈ సంక్షోభానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఎన్‌సీపీ నేత సుప్రియా శూలే కోరారు.
రైల్వే శాఖ కీలక నిర్ణయం
ఇండిగో సంక్షోభం వేళ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లు అనుసంధానించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్‌లు పెంచింది. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్‌లు ఏర్పాటు చేసింది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు ఛైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు ప్రయాణికుల కోసం అదనంగా నాలుగు ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది.


