– బీజేపీ నాయకులు ఒక్కరైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా?
– మెదక్ జిల్లాతో ఇందిరాగాంధీకి ప్రత్యేక అనుబంధం
– భూమిలేని నిరుపేదలకు భూములను పంచారు : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచం గుర్తించిన గొప్పనేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలో నిర్వహించిన ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇందిరా కుటుంబం.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అని కొనియాడారు. ఈ దేశం కోసం రక్తం ఇస్తాం, ప్రాణం ఇస్తాం అనిమోడీ, అమిత్ షా, బీజేపీ నేతలు మాట్లాడుతుంటారని, కానీ వారి పార్టీకి, నేతలకు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు ఇందిరా గాంధీతో ప్రత్యేక అనుబంధం ఉందని, మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. అప్పటి మెదక్ జిల్లా కాంగ్రెస్ అగ్ర నేతలు రాంచంద్రారెడ్డి, బాగారెడ్డి కోరిక మేరకు ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలివ్వాలనే సంకల్పంతో సంగారెడ్డికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తెచ్చారని తెలిపారు. అలాగే, బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) ఇక్రిశాట్ తెచ్చారని అన్నారు. దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ నినాదంతో దేశంలోని నిరుపేదల స్థితిగతులను మార్చే కృషి చేశారన్నారు. గరీబీ హటావో నినాదంతో దేశంలో పేదరికాన్ని పారదోలారని కొనియాడారు. భూమి లేని నిరుపేదలు, రైతులకు భూములు పంచారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు పంచిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, సీడీసీ చైర్మెన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మెన్ వై.ప్రభు, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ కుమార్, రఘుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచం గుర్తించిన గొప్ప నేత ఇందిరా గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



