నవతెలంగాణ – జుక్కల్
శనివారం నాడు జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రధానంగా మహిళల ఆర్థిక, సామాజిక, సాధికారతకే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవంలా వడ్డీ లేని రుణాల పంపిణీ జరుగుతుందని చెప్పారు.. మహిళలను మహారాణులుగా గౌరవిస్తూ, వారికి ఆర్థికంగా స్వావలంబన కల్పించేలా అనేక మార్గాల్లో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తోందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉండి ముందుకు నడిపిస్తోందన్నారు.
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద భీమా, రుణ భీమా కల్పనతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు,సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పాఠశాలలు, క్యాంటీన్లు,పెట్రోల్ బంకుల నిర్వహణ, స్కూల్ యూనిఫామ్‌ల తయారీ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పనులు మహిళలకే అప్పగిస్తూ, వారికి ఉపాధిని కల్పిస్తున్నామని తెలిపారు.
జుక్కల్ నియోజకవర్గంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మహిళలే నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా కృషి చేద్దామని,అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో పండిన పంటలకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో వాటిని సేల్స్ & మార్కెటింగ్ చేస్తే బాగుంటుందని,ఆ దిశగా ప్రణాళికలు చేపడుదామని సూచించారు..
అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గానికి మహిళా సంఘం తరపున పెట్రోల్ బంక్ మంజూరు కావడం జరిగిందని పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం ఏ మహిళా సంఘం అయితే ముందుకు వస్తుందో వారికి అనుకూలమైన ప్రదేశంలో స్థలాన్ని కేటాయించి పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సహకరించి ప్రోత్సహిస్తామని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల నిర్వహణ నిజాయితీ, నిబద్ధతో జరిగిందని,నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సేకరించి కోటి రూపాయలు లాభం ఆర్జించినందుకు మహిళా సంఘం సభ్యులను అభినందించారు. మహిళలు అందరూ తమలోని శక్తి, నైపుణ్యాలను, కళలను, సృజనాత్మకతను వెలికి తీసి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రంగాల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.