– మహిళా సంఘాలకు రూ.344 కోట్లు అందజేత
– పలుచోట్ల నూతన అద్దె బస్సులు, వ్యాపారాల ప్రారంభోత్సవాలు
– కొత్తగా సంఘాల్లో చేరిన 1.67 లక్షల మంది మహిళలు : సంబురాల్లో చురుగ్గా పాల్గొన్న మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇందిరా మహిళా శక్తి సంబురాలు రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈసారి మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.344 కోట్ల చెక్కులను అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.44 కోట్లను ఇచ్చింది. ఆర్థిక విజయాలు సాధించిన మహిళా సంఘాల బృందాలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి సన్మానాలు అందుకున్నాయి. ఈ సంబురాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) చురుగ్గా పాల్గొంటున్నారు. కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, ఇల్లందు, భూపాలపల్లితో పాటు పలు నియోజకవర్గాల్లోనూ మంత్రి స్వయంగా పాల్గొని మహిళల్లో ఉత్తేజాన్ని నింపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటూ వడ్డీ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. ఆర్టీసీ నూతన అద్దెబస్సులను, వివిధ వ్యాపారాల ప్రారంభోత్సవాలు చేస్తూ మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. మహిళల విజయగాథలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగిస్తున్న వ్యాపారాలు, పొందుతున్న ఆదాయం, తమ వ్యాపార అనుభవాలను వేదికలపై వివరిస్తున్నారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వారితో సొంత వ్యాపారాలను ప్రారంభింపజేసేందుకు ఇందిరా మహిళా శక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఏటా కనీసం రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంక్ లింకేజ్ ద్వారా మహిళా సంఘాలకు ప్రభుత్వమే రుణాలను సమకూర్చుతున్నది. మహిళలు తీసుకున్న లోన్లకు సకాలంలో వడ్డీలు చెల్లిస్తోంది. దీంతో పాటు ప్రమాద బీమా, లోన్ బీమా వంటి స్కీంలను అమలు చేస్తున్నది. ప్రమాదవశాత్తు మహిళా సభ్యురాలు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఎవరైనా మహిళలు ఇబ్బందులతో లోన్లు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే, ఇతర మహిళలకు భారం కాకుండా ప్రభుత్వమే రూ.2 లక్షల వరకు లోన్ బీమా చెల్లిస్తున్నది. ఇప్పటివరకు 410 మంది సభ్యులకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు చెల్లించింది. లోన్ బీమా కింద 5474 మంది సభ్యులకు రూ. 2 లక్షల వరకు అందజేసింది. దీంతో మహిళా సంఘాల్లో కొత్త సభ్యులు ఉత్సాహంగా చేరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 1.67 లక్షల మంది మహిళలు సంఘాల్లో కొత్తగా సభ్యులుగా చేరారు. గతంలో 18 నుంచి 60 ఏండ్ల వయస్సు గల మహిళలకే అవకాశాలుండగా…ఇప్పుడు 15-65 ఏండ్లకు రాష్ట్ర సర్కారు పెంచింది. వికలాంగ మహిళలకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో ప్రస్తుతమున్న 64 లక్షల సభ్యత్వాన్ని కోటి వరకు చేర్చే కార్యాచరణతో రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది.
నేటితో ముగియనున్న ఇందిరా మహిళా శక్తి సంబురాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES