– కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం
– అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపుసెట్లు
– ప్రజల ఆశీస్సులతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం
– శాంతి భద్రతలు, పన్నుల వసూళ్లలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
– మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభం
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
”తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం.. అభివృద్ధి విషయంలో మంత్రివర్గం ఎంతో కృషి చేస్తోంది.. ఇప్పుడు ప్రారంభించుకుంటున్న ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరంలాంటిది.. ఆడబిడ్డల ఆర్థిక పురోభివృద్ధి కోసం పాటుపడుతున్నాం.. రాబోయే రోజుల్లో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. ఒక ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడి ఎదిగితే ఆ కుటుంబం, ఆ ప్రాంతం ఎదుగుతుంది” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనుల అభ్యున్నతికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ ప్రాంతంలోని మాచారంలో సీఎం ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మాచారం చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ బాదావత్ సంతోష్, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం, మంత్రులు సీతరామాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆ తర్వాత మాచారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం పైలాన్‌ను ప్రారంభించారు. గిరిజనుల కోసం రూ.12,600 కోట్లకు సంబంధించిన నల్లమల డిక్లరేషన్‌ను మంత్రులతో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. ఒకప్పుడు నల్లమల అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతమని, ప్రస్తుతం ప్రజల ఆశీస్సులతో ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వచ్చి అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. అప్పట్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను గెలిపించాలని ఎన్నికల సమయంలో తాను కోరగా యాభైవేల పైచిలుకు మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించారని.. తాను నల్లమల బిడ్డగా చెప్పుకోవడానికి గర్వంగా ఉందని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఎంత బాధ్యత ఉందో..ఈ ప్రాంత బిడ్డగా తనకూ అంతే ఉందని చెప్పారు. నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని, నిధులు విడుదల చేయాలని మంత్రులను కోరారు. గిరిజనులు ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం చేపట్టినట్టు తెలిపారు. ఈ రోజు చెంచు ఆడపడుచులతో మాట్లాడానని, అలివేలు అనే మహిళ తోటల పెంపకం గురించి చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు. అలాగే సోలార్ విద్యుత్తుపై అవగాహన కల్పించడంతోపాటు ఇండ్లకు, వ్యవసాయ అవసరాలకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలి చ్చినట్టు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపుసెట్లను రాబోయే వంద రోజుల్లో ఉచితంగా అంద జేస్తామని చెప్పారు. ఈ విషయంలో అచ్చంపేట ప్రపంచానికి, దేశానికి ఆదర్శంగా ఉంటుందన్నారు. పాలమూరు జిల్లా వారికి పాలన చేతకాదని అవహేళన చేసే వారికి.. తాము తట్ట, పార పనితోపాటు పరిపాలన కూడా చేస్తామని ఏడాదిన్నరలో నిరూపిం చామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని సీఎం వివరించారు. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని చెప్పారని, కానీ తమ ప్రభుత్వంలో సన్నరకం వడ్లను పండిస్తే రూ.500 బోనస్ కూడా ఇస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన సన్నవడ్లను తిరిగి రేషన్ ద్వారా ప్రజలకు సన్న బియ్యంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెలా మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని, గహజ్యోతి, మహాలక్ష్మీ పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. అలాగే, పొదుపు సంఘాల సభ్యులకు ఆర్టీసీ బస్సులను ఇచ్చి వాటికి వారిని యజమానులను చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఒకప్పుడు సోలార్ అంటే అదానీ, అంబానీలకే అనుకునే వారని, ప్రస్తుతం తాము ఆడబిడ్డలకు, గిరిజన పుత్రులకు సైతం అందిస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు కూడా కేటాయించి వారే స్వయంగా నడిపే విధంగా చేశామన్నారు. ఆడబిడ్డలకు హైదరాబాద్ శిల్పారామం పక్కన స్థలం కేటాయించి వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు. తాము వచ్చిన మొదటి సంవత్సరం లోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రయివేట్ రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు వివరించారు. 12 యూనివర్సిటీల్లో వైస్‌చాన్స్‌లర్లను నియమించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీలను తీసుకొస్తున్నామని, ఈ విషయంలో తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. శాంతిభద్రతల విషయంలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్టు కేంద్రం ప్రకటించిందన్నారు. పన్నుల వసూళ్లలోనూ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని వివరించారు. అప్పట్లో భూమి, భుక్తి కోసం పోరాటాలు, స్వేచ్ఛ కోసం పోరాటాలు జరిగాయని, వాటిని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి తెలిపారు. పేదలకు 25 లక్షల ఎకరాల భూములను అందించి వారికి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
ఇందిరాగాంధీలా ఉండాలి..
ప్రధానమంత్రి ఎలా ఉండాలంటే ఇందిరాగాంధీలా ఉండాలని పహల్గాం ఘటనతో ప్రతి ఒక్కరికీ తెలిసి వచ్చిందని సీఎం అన్నారు. ప్రతి పేదవారి గుండెల్లో తండాల్లో, గూడేల్లో ఇంది రాగాంధీ ఉన్నారని తెలిపారు. అందువల్లే ఈ పథకానికి ఇందిరా సోలార్ వికాసం పథకంగా పేరు పెట్టినట్టు చెప్పారు. అనంతరం అచ్చంపేట నియోజకవర్గంలో స్వయం సహాయక బృందాలకు రూ.119 కోట్ల చెక్కులు అందజేశారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు జ్ఞాపికలు అందజే శారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లురవి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకీష్ణ, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇందిరా సౌరగిరి జల వికాసం గిరిజనులకు వరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES