జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదలకు త్వరలో తీపికబురు
అపార్ట్‌మెంట్ తరహాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కంటోన్మెంట్‌లో లబ్దిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ
నవతెలంగాణ-సిటీబ్యూరో/కంటోన్మెంట్
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, పేదలు ఆత్మగౌరవంగా బతికేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికీ 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, గ్రామాల్లో పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గం రసూల్‌పురలోని నారాయణ జోపిడి సంఘం వద్ద రూ.22కోట్ల 32లక్షలతో 5బ్లాక్‌లుగా నిర్మించిన 288 డబుల్‌బెడ్ రూం ఇండ్లను శనివారం హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే శ్రీగణేష్ తదితరులతో కలిసి మంత్రి ప్రారంభించారు. లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలేసిన డబుల్‌బెడ్‌రూం ఇండ్లను యుద్ధప్రా తిపదిక పూర్తిచేసి లబ్దిదారులకు అందిస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పేదలకు త్వరలో ఇండ్లు మంజూరు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు అపార్ట్‌మెంట్ తరహా ఇండ్లను అందించేలా తియ్యటి కబురు చెబుతామని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 30 నుంచి 70 గజాలున్నాసరే స్థానికంగా నివసించే వారికి అపార్ట్‌మెంట్ తరహాలో ఇండ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో మొండి గోడలతో ఉన్న ఇండ్లను పూర్తిచేసి ఇస్తామని మాట ఇచ్చాను.. దానిని నెరవేర్చామని స్పష్టం చేశారు. నాటి ప్రభుత్వంలో పేదలకు అన్యాయం చేశారని, ఏడాదికి లక్ష ఇండ్లు కట్టినా పదేండ్లలో పది లక్షల ఇండ్లు పేదలకు వచ్చేవన్నారు.
ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తొలివిడతగా 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంకల్పించిందన్నారు. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గణేష్ ప్రస్తావించిన అంశాల మేరకు వాజ్‌పేయి కాలనీలో మొండిగోడలతో ఉండిపోయిన ఇండ్లను పూర్తిచేసి లబ్దిదారులకు ఇచ్చేలా మంత్రి అధికారులను ఆదేశించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో సౌకర్యాలతో కూడిన శ్మశానవాటిక నిర్మిస్తామని, ఈ విషయంలో కేంద్రం నుంచి అనుమతుల సాధించాలని ఎంపీ రాజేందర్‌ను కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నారాయణ జోపిడి వాసులకు దసరా పండుగ ముందుగానే వచ్చిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇండ్ల పట్టాలు అందుకుంటున్న లబ్దిదారులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.