మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ జిల్లాలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక , రెండు పడకల గదుల ఇండ్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఇండ్ల మంజూరులో పారదర్శకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అందించటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎల్ వన్ (ఎల్1) కింద 4,800 మంది అర్హులైన ఇండ్ల స్థలాలు ఉన్న పేదలకు రెండు పడకల గదుల ఇండ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
అలాగే ఎల్ టు (ఎల్ 2) కింద హైదరాబాద్ జిల్లాలో నాలుగు లక్షల ఇరవై రెండు వేలకుపైగా దరఖాస్తులు వివిధ నియోజకవర్గాల నుంచి పేద ప్రజలు అందజేశారని మంత్రి వివరించారు. హైదరాబాద్ మహానగరంలో స్థలాలు సేకరించి జీ ప్లస్ 5-10 వరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వివరించారు. పెండింగ్‌లో ఉన్న 2 బీహెచ్‌కే ఇండ్ల పనులు పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు సూచించారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ? లబ్దిదారులు ఎంత మంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 2 బీహెచ్‌కే లబ్ధిదారులకు అందించామనీ, ఇంకా పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్ధలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి, పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల శాసనసభ్యుల అభిప్రాయాలను ఈ సందర్భంగా స్వీకరించి చేపట్టే అంశాలపై చర్చించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరాం హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



