Thursday, September 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయాలి

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయాలి

- Advertisement -

ప్రతి రైతుకీ యూరియా కొరత లేకుండా చూడాలి
భారీ వర్షాలకు నష్టపోయిన పత్తి, పెసర రైతులను ఆదుకోవాలి
ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని, నున్నా

నవతెలంగాణ- చింతకాని
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడు గ్రామం నుంచి చింతకాని మండల కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించారు. సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు కొండ్రు జానకి రామయ్య జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రేపల్లెవాడ గ్రామంలో వర్షాలతో నష్టపోయిన పత్తి పంటను పాదయాత్ర బృందం సందర్శించింది. అనంతరం సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిజమైన లబ్దిదారులు ఇందిరమ్మ ఇల్లు రాక నష్టపోయారని, ఒక్కొక్క గ్రామంలో ఇల్లు, పొలాలు ఉన్న వారికి, కాంగ్రెస్‌ నాయకులకు ఇష్టం వచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని ఆరోపించారు. యూరియా కోసం సొసైటీ కార్యాలయాల దగ్గర రైతులు తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడి ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తక్షణమే గ్రామాల్లో రైతులకు యూరియా అందుబాటులో ఉంచేలా చూడాలని కోరారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు పత్తి, పెసర రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయారని తెలిపారు.

మళ్లీ విత్తనాలు నాటి సాగుచేయగా.. తీరా పంట చేతికి వచ్చేసరికి వర్షాలు, వరదలతో పంటలు కొట్టుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. మధిర నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు పత్తి, పెసర సాగు చేసి ఎకరానికి 50 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. తీరా వర్షాలతో పంట చేతికి రాకపోయేసరికి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ పాదయాత్రకు బీఆర్‌ఎస్‌ మండల కమిటీ సంఘీభావం తెలిపింది. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ బాబ్జి ప్రసాద్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి సామినేని రామారావు, సీపీఐ(ఎం) మధిర డివిజన్‌ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కార్యదర్శి రాచబంటి రాము, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వత్సవాయి జానకిరాములు, నాయకులు కాటబత్తిని వీరబాబు, రౌతు అప్పారావు, మాదినేని రవి, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -