Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబాధితులకు బాసటగా ఇందిరమ్మ ఇండ్ల 'కాల్‌ సెంటర్‌'

బాధితులకు బాసటగా ఇందిరమ్మ ఇండ్ల ‘కాల్‌ సెంటర్‌’

- Advertisement -

పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్‌, మరొకరిపై విచారణ
ఇందిరమ్మ కమిటీ సభ్యునిపై క్రిమినల్‌ కేసు నమోదు
ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే తగిన చర్యలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నదని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాల్‌ సెంటర్‌ బాధితులకు బాసటగా నిలుస్తున్నదని గురువారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా సంకోచించకుండా లబ్దిదారులు ఈ నెంబర్‌ 1800 599 5991కు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే అధికారులు రంగంలోకి దిగి తక్షణ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మంజూరులో లంచాలు అడుగుతున్న అధికారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. పేదల నుంచి పైసా వసూలు చేసిన సహించబోమని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్‌ చేసిన సంగారెడ్డి జిల్లాలోని పంచాయితీ కార్యదర్శిని సస్పెండ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మాజిద్‌పూర్‌ గ్రామ కార్యదర్శిపై లోతైన విచారణకు ఆదేశించామని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాండూరు మండలంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశామని మంత్రి గుర్తు చేశారు.

కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులిలా…
– సంగారెడ్డి జిల్లా నిజాంపేట, ఏదులతండాకు చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు అంగోత్‌ తులసీభాయి నేరుగా హౌసింగ్‌ కార్పొరేషన్‌లోని కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి తన ఇంటి నిర్మాణం పునాదుల వరకు పూర్తయిందని అయితే అంతవరకు ఫోటో తీసి పంపేందుకు పంచాయితీ కార్యదర్శి పి. మహబూబ్‌ అలీ రూ. 10 వేలు డిమాండ్‌ చేశారు.

– రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మండలం మాజిద్‌పూర్‌కు చెందిన కల్లె సత్యాలు అనే ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు నేరుగా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి తమ పంచాయితీ కార్యదర్శి రాఘవేంద్ర పలు రకాలుగా సమస్యలను సృష్టించి వేధిస్తున్నారని చెప్పారు. రూ.20వేలు లంచం అడిగారు.

-నాగర్‌ కర్నూలు జిల్లా తాండూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన ఏదుల భీమమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారు చేపట్టిన ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతూ, ఆమెను బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేశారు. భీమమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా ఆమె బావ ఏదుల నారాయణ తన భార్య పిల్లలతో కలిసి ఇంటి నిర్మాణాన్ని అడ్డుపడ్డారు. నారాయణకు అండగా నిలిచిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు చిక్కోండ్ర మల్లేష్‌ జోక్యం చేసుకొని రూ. 25వేల రూపాయిలను డిమాండ్‌ చేశాడు. విచారణ జరిపిన పోలీసులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మల్లేష్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -