నవతెలంగాణ -పరకాల
మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం రోజున పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇందిరా గాంధీ దేశ సమగ్రత కోసం అవిశ్రాంతంగా పోరాడిన ‘ఉక్కు మహిళ’ అని కొనియాడారు. పేద ప్రజల అభ్యున్నతికి, సంక్షేమానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశంలోని నిరుపేదలకు భూములు పంపిణీ చేయడంతో పాటు, లక్షలాది మందికి ఇళ్లు కట్టించిన ఘనత ‘ఇందిరమ్మ’కే దక్కుతుందని ఉద్ఘాటించారు.
“ఇందిరా గాంధీ పాలనను స్ఫూర్తిగా తీసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ రాజ్యం’ స్థాపన కోసం కృషి చేస్తోంది. నిరుపేదలకు ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మించి ఇస్తున్నారు. అలాగే, ప్రతి మహిళ ఆర్థికంగా శక్తివంతంగా మారేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు,” అని కొయ్యడ శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సోద రామకృష్ణ, చందుపట్ల రాఘవరెడ్డి, దుబాసి వెంకటస్వామి, చిన్నాల గోనాథ్, బండి సదానందం, మార్క రఘుపతి గౌడ్, బొచ్చు శ్రీధర్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



