నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం బంగారు పల్లి గ్రామంలో గంగవ్వ అనే లబ్దిదారురాలు యొక్క ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ వేడుకలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలోనే కాదు కామారెడ్డి జిల్లాలోనే వేగంగా నిర్మాణం పూర్తయ్యి గృహప్రవేశం జరుపుకున్న మొదటి ఇందిరమ్మ ఇళ్లు కావడం విశేషం. గత బీఆర్ఎస్ పాలనలో జుక్కల్ నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదని బాధ, ఆవేదనతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. సాధ్యమైనంత వరకు నియోజకవర్గానికి ఎక్కువ ఇండ్లు మంజూరు చేయించాలని పట్టుదలతో పని చేస్తూ వచ్చారు.

ఎమ్మెల్యే కృషి, పట్టుదల వల్లే జిల్లాలోనే మొదటి ఇందిరమ్మ ఇళ్లు బంగారు పల్లిలో పూర్తి అయింది. ప్రభుత్వం ప్రతీ సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు వెంట వెంటనే బిల్లులు విడుదల చేయడంతో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క గుడిసె కూడా ఉండకూడదని,పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదవాడి సొంతింటి కల సాకారం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్, విండో చైర్మన్ శివానంద్ , స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ దేశాయ్ , సూర్నార్ మనోహర్ పటేల్, రాజులు సెట్ , అనిల్ సెట్ , రాములు సేట్, ఎంపీడీవో శ్రీనివాస్, లబ్ధిదారులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

