గ్రూప్ -2లో ఉద్యోగం సాధించిన పేద విద్యార్థికి సన్మానం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ
రాష్ట్రంలోని నిరుపేదలు,గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతాన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఉద్యోగం సాధించిన పేద విద్యార్థికి సన్మానం
గూడూరు గ్రామానికి చెందిన ఇరుగంటి లింగమ్మ,చిన్న మట్టయ్య దంపతుల కుమారుడు నాగరాజు ఇటీవల జరిగిన గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి,ఎంపీఓ ఉద్యోగాన్ని దక్కించుకున్నందున ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అభినందించారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని ఆయన కోరారు. పేద కుటుంబం నుంచి వచ్చినందున ఉద్యోగ బాధ్యతలలో పేదల పక్షాన నిలబడి సేవలందించాలన్నారు. పేద విద్యార్థులకు నియవంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో స్థానికులతో కలిసి దీపాలు వెలిగించి ఎమ్మెల్యే బిఎల్ఆర్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.