- – నిర్మాణానికి ఇసుక ఉచితం..
– నియోజకవర్గానికి అదనంగా 1750 ఇండ్లు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపిన ఆది..
– దళారులతో పైరవి చేయాల్సిన అవసరం లేదు..
– ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..
– అర్బన్ మండలంలో 370, రూరల్ మండలంలో 333 మందికిమందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు..
– పంపిణీ చేసిన విప్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
నవతెలంగాణ వేములవాడ / వేములవాడ రూరల్ - నియోజవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం రెండో విడత క్రింద వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆయా గ్రామాల ప్రజలకు 371,వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామంలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్ లో ఆయా గ్రామాల ప్రజలకు 333 ఇందిరమ్మ ఇండ్ల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులు విప్, కలెక్టర్ తో కలసి పంపిణీ చేశారు.
- ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ. నియోజకవర్గం లో మొత్తం 3500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వేములవాడ నియోజకవర్గం లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని ఉద్దేశంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అదనంగా ఇవ్వాలని కోరానని దీంతో ఆయన వెంటనే స్పందించి 1750 మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. నిర్ణీత సమయం, ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం త్వరితగతిన ఇల్లు నిర్మించుకొని సహాయం పొందాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.20 వేల కోట్ల రైతు రుణమాఫీ, 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, తదితర పధకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని వివరించారు.
- పారదర్శకంగా ప్రభుత్వం నిధుల విడుదల
- ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ చేయాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి ఒక రూపాయి ఇవ్వడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు.
*4 దశల్లో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం*
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ వేములవాడ అర్బన్ మండలంలో 371మందికి, రూరల్ మండలంలో 333 మంది లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని,400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. 4 దశల్లో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తైన తర్వాత లక్ష రూపాయల, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తరువాత 2 లక్షల రూపాయలు,ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు.
నిర్మాణాలకు ఇసుక ఉచితం
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామని , నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాలలో అందుబాటులో పెడతామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి ఒక్కో దశలో అవసరమైన ఇసుక కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. రవాణా ఛార్జీలు చెల్లించాలని కలెక్టర్ సూచించారు. 30 రోజుల లోగా నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించని పక్షంలో మంజూరు చేసిన ఇండ్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిడి హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీరాజ్యం,మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, తహసిల్దార్, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, సంబంధిత అధికారులు, ఇందిరమ్మ కమిటీ సబ్యులు తో పాటు తదితరులు ఉన్నారు.