Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగవర్నర్‌ దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు

గవర్నర్‌ దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

– మంత్రి పొంగులేటి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దత్తత తీసుకున్న గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్ల పధకం గురించి వివరించారు. ఈ ఏడాది ప్రతినియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. గవర్నర్‌ ఆలోచన, ముఖ్యమంత్రి సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇండ్లను మంజూరు చేస్తున్నామనీ, ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు పదివేల ఇండ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు. మొదటిదశలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతాక్రమంలో మంజూరు చేస్తున్నామని తెలిపారు. గవర్నర్‌ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట, గోగులపూడి, ఆదిలాబాద్‌ జిల్లా భుర్కి, మంగ్లీ , నాగర్‌ కర్నూల్‌ జిల్లా అప్పాపూర్‌ , బౌరాపూర్‌ గ్రామాల్లో ఇండ్లను మంజూరు చేశామని వివరించారు. రాష్ట్రంలో గత పదేండ్లుగా నెలకొన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని గత నెల 17నుంచి నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశామనీ, ఈనెల ఐదు నుంచి 28 మండలాల్లో అమలు చేస్తున్నామని గవర్నర్‌కు తెలిపారు. ఎలాంటి రుసుము లేకుండానే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఐడీసీ ఛైర్మెన్‌ మువ్వ విజయబాబు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ విపి గౌతమ్‌ తదితరులున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad