దళారుల ‘దగా’పై ఉక్కుపాదం బాధితులకు ‘సర్కారు’ దన్ను
‘అండగా నిలుస్తాం.. మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది’ : వెలుగుమట్ల నిర్వాసితులకు మంత్రి పొంగులేటి హామీ
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘అప్పులు చేసి నిర్మించుకున్న ఆశల గూడు కూలిపోయిందని ఆవేదన చెందకండి.. ఈ ప్రభుత్వం మీది. మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది. అర్హులైన ప్రతీ పేదవాడికి ఈ నెల 15 లోపు ఇండ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం’ అని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలుగుమట్ల బాధితులకు భరోసానిచ్చారు. ఖమ్మం ఐడీఓసీలో ఆదివారం బాధితులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు.
డబ్బులు వసూలు చేయించి ఇస్తామని హామీ..
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేండ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతన మంత్రి ఎదుట వెలుగుచూసింది. తక్కువ ధరకే స్థలం వస్తుందని నమ్మి, రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లోనూ రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించామని మంత్రి ఎదుట బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో తామంతా దిక్కుతోచని స్థితిలో పడ్డామన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఒక్క పైసా కూడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనిలేదని, దళారుల నుంచి డబ్బును రికవరీ చేయిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
చీకటి బతుకుల నుంచి వెలుగు కాలనీల వైపు..
గత 9 నెలలుగా కరెంటు, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు లేక చీకట్లో మగ్గుతు న్నామని బాధితులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. కేవలం ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, కొత్తగా నిర్మించే కాలనీల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రయినేజీతో పాటు అంగన్‌వాడీ, పాఠశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నియో జకవర్గాల వారీగా బాధితులను గుర్తించి, వారి ప్రాంతాల్లోనే పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు.
శవాల మీద చిల్లర ఏరుకోవద్దు..
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేతలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అధికారం పోగానే షెడ్ల కింద కూర్చొని డ్రామాలు ఆడుతున్నారని, రాజకీయాల కోసం పేదలను కవచంలా వాడుకోవడం మూర్ఖత్వమని దుయ్య బట్టారు. మీ పార్టీ ఏదైనా సరే.. నిజమైన పేదలైతే ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుతుందని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకమైన సర్వే ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు.
అర్హులకే పట్టా.. మార్చి 15 ‘డెడ్ లైన్’
గతంలో లబ్దిపొందిన వారిని ఏరివేసి, కేవలం నిరుపేదలకే న్యాయం జరిగేలా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. ఈ నెల 15న తానే స్వయంగా వచ్చి అర్హులైన కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల ఆర్డర్లు అందజేస్తానని భరోసా ఇచ్చారు. అధికారులే నేరుగా బాధితుల వద్దకు వస్తారని, మరోమారు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.



