మార్చి చివరి నాటికి లబ్దిదారుల ఎంపిక
అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి చర్యలు
ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్ మధ్య అఫర్డ్‌బుల్ హౌసింగ్ పాలసీ
ఈనెలాఖర్‌లోగా ఇండ్ల స్థలాలు ఉన్న 28వేల మందికి మంజూరు పత్రాలు : సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చూడుతున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి వచ్చే మార్చి చివరినాటికి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్ధలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి, పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపై మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి పొంగులేటి సమీక్షించారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎమ్‌డీ వీపీ గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమీషనర్లు పాల్గొన్నారు.
మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇండ్ల స్థలాలు ఉన్న 28వేల మంది లబ్దిదారులకు ఈనెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. హైదరాబాద్‌కు దూరంగా గతంలో 42వేల ఇండ్లను నిర్మించగా అందులో సగం మంది మాత్రమే నివసిస్తున్నారనే తమ క్షేత్రస్థాయి సర్వేలో తేలిందని గుర్తు చేశారు. అలాగే చాలాచోట్ల బోగస్ లబ్దిదారులు కూడా ఉన్నారని అధికారులు మంత్రులకు వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆలోచనలకనుగుణంగా ,నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా, వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా స్ధానిక పరిస్ధితులను బట్టి ఐదు నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే ఆలోచన చేస్తున్నామని, వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
‘ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ల కమీషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్ల సమన్వయంతో వారి ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి ఎన్ని ఇండ్లు నిర్మించవచ్చు, ఎంతమంది లబ్దిదారులున్నారు. పదిరోజుల్లో నివేదిక అందజేయాలి. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి’ అని అధికారులను ఆదేశించారు. మురికివాడల్లో స్ధలం ఉన్నవారు అంగీకరిస్తే ఆ ప్రాంతంలో జీప్లస్ 5 వరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేస్తున్నామని జేఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం పధకంలో నిర్మించిన ఇండ్లు శిధిలావస్ధకు చేరాయనీ, వాటి స్థానంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే ఆలోచన చేస్తున్నామన్నారు.



